
బీఆర్‌ఎస్ మాజీ నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజుల కిందటే ఆయన గులాబీ పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంపై ఇవాళే స్పష్టత వచ్చింది. బీజేపీలో చేరబోతున్నారని అధికారిక సమాచారం.
సాక్షి, హైదరాబాద్: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావుతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన తమ పార్టీలో చేరబోతున్నారని రామచందర్‌రావు ప్రకటించారు. నియోజకవర్గ, జిల్లా ప్రజలు, కార్యకర్తలతో చర్చించాకే బాలరాజు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
2007 అక్టోబరు 6న బీఆర్‌ఎస్‌లో చేరారు గువ్వల బాలరాజు. 2009లో నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్(ప్రస్తుత బీఆర్‌ఎస్) తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో, 2018లో రెండు పర్యాయాలు అచ్చంపేట(ఎస్సీ) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2022 నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు.
కొంతకాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న ఆయన అనూహ్యంగా రాజీనామా చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాశమైంది.రాజీనామా సమయంలోనే ఆయన బీజేపీ అధిష్టానం నుంచి భరోసా ఇవ్వడంతోనే ఆయన బీఆర్‌ఎస్‌ను వీడినట్లు చర్చ జరిగింది కూడా. అటుపై ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్‌ఎస్ తీవ్రంగా విఫలమైందంటూ బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
