‘సాఫ్ట్‌వేర్‌ శారద’ కథనంపై స్పందించిన ఎంపీ

MP Pasunuri Dayakar Responds On Software Engineer Sharada Story - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/వరంగల్: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముతున్న యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శారద స్ఫూర్తిదాయకమైన కథనంపై పలువురు ప్రముఖులు స్పందించారు. కష్టపడి పనిచేయాలన్నది శారద ఆదర్శంగా తీసుకున్నారని వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. తద్వారా యువతకు ఆదర్శంగా నిలిచిచారని కొనియాడారు. శారద కష్టపడేతత్వం చూసి గర్వంగా ఫీలవుతున్నానని తెలిపారు. ఆమె కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు. శారద కుంటుంబాన్ని కలుస్తానని ఎంపీ వెల్లడించారు. 

స్టాఫ్‌వేర్ ఉద్యోగిగా పనిచేసి కూరగాయలు అమ్ముతున్న శారద కథనం తనను ఎంతగానో కదిలించిందని తెలంగాణ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శారద ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ప్రభుత్వం తరఫున శారద కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ఇక సాఫ్ట్‌వేర్‌ శారదపై సాక్షి కథనానికి ఉపరాష్ట్రపతి కార్యాలయం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్ మీడియా విభాగం, తెలంగాణ బీజేపీ నాయకులు, పలువురు ఎన్‌ఆర్‌ఐలు స్పందించారు. ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు పలు ఐటీ సంస్థలు ముందుకొచ్చాయి. 
(చదవండి: భూ వివాదం : సెల్‌ టవర్‌ ఎక్కిన యువకుడు)

జీవితం అంటే అదొక్కటే కాదు
ఉద్యోగం ఒక్కటే లైఫ్ కాదని యువ సాఫ్ట్‌వేర్‌ శారద అన్నారు. నెగటివ్‌గా ఆలోచించి ఆత్మహత్యలకు పాల్పడవద్దని సాక్షి టీవీతో మాట్లాడుతూ ఆమె యువతకు సందేశం ఇచ్చారు. ఓడిపోయినా ధైర్యంగా నిలబడి విజయం సాధించవచ్చని తెలిపారు. ఇదిలాఉండగా.. కుటుంబం కోసమే శారద కూరగాయలు అమ్ముతోందని ఆమె తల్లి తెలిపారు. శారదను చదివించేందుకు చాలా కష్టపడ్డానని చెప్పారు. చిన్నతనం నుంచి శారద బాగా కష్టపడేదని అన్నారు. వయసు పైబడిన తండ్రికి సాయం చేస్తోందని అన్నారు.

కాగా, దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్లు సాప్ట్‌వేర్‌ ఉద్యోగం చేసిన శారద ఇటీవల హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మంచి ప్యాకేజీకి కొత్తగా జాబ్‌లో జాయిన్‌ అయ్యారు. మూడు నెలల పాటు ట్రైనింగ్‌ కూడా పూర్తి చేసుకున్నారు. అంతలోనే కరోనా వ్యాప్తి మొదలవడం, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో సదరు కంపెనీ యాజమన్యం ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించింది. అయినప్పటికీ ఎలాంటి కుంగుబాటుకు లోనవకుండా ఆమె తల్లిదండ్రులకు తోడుగా కూరగాయల వ్యాపారం ప్రారంభించారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు.
(కూరగాయలు అమ్ముతున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top