
జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురుపై కేసు నమోదు
హైదరాబాద్: మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ)ను ఉల్లంఘించి ప్రార్థన స్థలాల వద్ద అనుమతులు తీసుకోకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురు మాగంటి అక్షర, యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్‌తో పాటు మరో నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురు అక్షరతో పాటు కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్, బీఆర్‌ఎస్ నేతలు ఆజం అలీ, అంజద్ అలీఖాన్, ఫయీం, షఫీ తదితరులు పార్టీ కండువాలు వేసుకుని వెంకటగిరిలోని ఓ ప్రార్థన మందిరం వద్ద శుక్రవారం మధ్యాహ్నం కరపత్రాలతో కనిపించారు.
ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ డిప్యూటీ తహసీల్దార్ ఫ్రాన్సిస్ గమనించి సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో మాగంటి సునీతతో పాటు ఆమె కూతురు, ఇతర నేతలు చేతుల్లో కార్డులు పట్టుకొని ప్రార్థనలు చేసి వచి్చన వారిని ప్రభావితం చేసే కార్యక్రమాలు చేపడుతున్నట్లు గుర్తించారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి పూర్తి విరుద్ధమని, మతపరమైన ప్రాంతాల్లో రాజకీయ పార్టీల ప్రచారాలు చేయకూడదని ఎన్నికల నిబంధనలు ఉన్నట్లు గుర్తించిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అధికారి ఫ్రాన్సిస్ తెలిపారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.