నిజాలు నిగ్గుతేల్చండి

MLA Raghunandan Complaint to ED and CEC Over TRS MLAs Buying Issue - Sakshi

ఈడీ, సీఈసీలకు ఎమ్మెల్యే రఘునందన్‌ ఫిర్యాదు 

ఎమ్మెల్యే కొనుగోలు ఆరోపణలను సమగ్రంగా పరిశీలించాలి 

సాక్షి, హైదరాబాద్‌: నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర పరిశీలన జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) డైరెక్టర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్‌రావు విజ్ఞప్తి చేశారు. స్థానిక నాయకులు, అధికారులు కలిసి ఈ వ్యవహారం వెనక ఒక జాతీయ పార్టీ నాయకత్వం ఉందంటూ ఒక సినిమాకథ సిద్ధం చేశారన్నారు.

రాజకీయ నేతల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్న స్థానిక అధికారులపై తమకు నమ్మకం లేదని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో రఘునందన్‌రావు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటూ మీడియాలో వార్తలు రాగా, పోలీసుల రిమాండ్‌ రిపోర్ట్‌లో ఆ వివరాలేవీ లేవన్నారు. ప్రస్తుత ఆర్థిక విధానాలకు అనుగుణంగా రూ.2 లక్షలకు మించి నగదు కలిగి ఉండరాదని, అంతకుమించి ఉంటే మనీలాండ రింగ్‌ కిందకు వస్తుందని చెప్పారు. ఈ  వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని కోరారు.  

సైబరాబాద్‌ సీపీపై ఫిర్యాదు 
ఉప ఎన్నిక జరగనున్న సందర్భంలో ఆధారా లు లేకుండా జాతీయపార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రయత్నిస్తున్నారంటూ ఢిల్లీలోని కేంద్ర ఎన్ని కల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ)కు ఎం.రఘునందన్‌రావు మరో ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను డబ్బుతో లోబర్చుకునేందుకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు సైబరాబాద్‌ పోలీసులు ఫిర్యాదు చేశారన్నారు.

ఈ నేరాన్ని నిరూపించే ఆధారాలనుగానీ, డబ్బు లావాదేవీలను గానీ పోలీసులు చూపకపోవడంతో కోర్టు ఆ ముగ్గురిని రిమాండ్‌కు పంపేందుకు నిరాకరించిందని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ఉదంతాలపై విచారణకు ఆదేశించాలని కోరారు. దేశాన్ని పాలిస్తున్న జాతీయపార్టీ నాయకత్వంపై నెపం మోపి, దాని ప్రతిష్ట దిగజార్చేందుకు అధికారులు గిమ్మిక్కులకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు సాగేందుకు వీలుగా ఈ వ్యవహారంలో ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. ఫిర్యా దుల ప్రతులను ఢిల్లీలోని ఈడీ,కేంద్ర న్యాయ, డీవోపీటీ శాఖలకు కూడా పంపించారు.   

నా వాంగ్మూలాన్ని నమోదు చేశారు 
ఫిర్యాదుపై ఈడీ తన వాంగ్మూలాన్ని నమోదు చేసిందని, దీని ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతుందని రఘునందన్‌రావు చెప్పారు. సీఎం కేసీఆర్‌ దర్శకత్వంలోనే ‘ఫామ్‌హౌజ్‌ లీలలు, నగదు’ సినిమా విడుదలైందని ఎద్దేవాచేశారు. బేరసారాలకు వచ్చిన ముగ్గురు వ్యక్తుల మొబైల్‌ఫోన్లు ఎక్కడున్నాయో చెప్పాలన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top