కరోనాపై మంత్రి ఈటల రాజేందర్‌ సమీక్ష

Minister Etela Rajender Review Meeting On Corona - Sakshi

సాక్షి, కామారెడ్డి: కరోనా వైరస్‌కు తోడు సీజన్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం కరోనా నియంత్రణ చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో సమస్యలు తెలుసుకోవడానికి సమీక్షలు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రపంచంలో భగవంతుని తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకుంది వైద్యుడు మాత్రమేనన్నారు.

‘‘కరోనా వచ్చిన తర్వాత ప్రపంచమంతా అప్రమత్తమైంది. కరోనా ప్రభావం ఎలా ఉంటుందో డబ్ల్యూ హెచ్ ఓ, ఐసీఎంఆర్‌కు కూడా తెలియలేదు. కానీ వారిచ్చిన సలహాలను పాటించాం. 81 శాతం మందికి కూడా ఈ వైరస్ సోకినట్టు కూడా తెలియదు. ఈ వైరస్ బారిన పడిన వారికి అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలకు మించదు. తీవ్రత ఉండి ఆసుపత్రికి వెళ్లినప్పుడే ఖర్చవుతుందని’’ మంత్రి పేర్కొన్నారు. ర్యాపిడ్ టెస్టులు చేయడంలో ఆలస్యమయిందని, ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు ర్యాపిడ్ టెస్టుల సంఖ్య పెంచామని తెలిపారు. లక్షణాలు లేని వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. హోం ఐసోలేషన్‌కు పంపే ముందు ఇంటిలో ఉన్న వారి వివరాలను సేకరించాలని సూచించారు.

‘‘కరోనా లక్షణాలున్నవారిని ప్రభుత్వ ఐసోలేషన్‌కు తరలించాలి. అనస్థీషియా డాక్టర్లు ఎవరైనా ఉంటే వెంటనే ఏర్పాటు చేసుకోండి. అవసరం ఉన్న చోట ఆక్సిజన్, వెంటిలేటర్ వసతి కల్పిస్తాం. వైద్యులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని’’ మంత్రి తెలిపారు. 31వ తేదీ లోపు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు అందించే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బాధితులకు ధైర్యం చెప్పకుండా కొందరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం తగదన్నారు.

కరోనా విపత్తు సమయంలో మరణించిన వ్యక్తిని కుటుంబ సభ్యులు కూడా ముట్టకునే పరిస్థితి లేదు. కానీ వైద్యులు, మున్సిపల్‌ సిబ్బంది అంత్యక్రియలు చేస్తున్నారు. వైద్యులను అభినందించాల్సి పోయి హేళన చేస్తూ మాట్లాడుతున్నారని మంత్రి రాజేందర్‌ దుయ్యబట్టారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top