షూటింగ్‌ స్పాట్‌గా మిడ్‌ మానేరు

Mid Manair Surroundings Become Shooting Spots In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: శ్రీరాజరాజేశ్వర(మిడ్‌మానేరు) ప్రాజెక్టు పరిసరాలు షూటింగ్‌ స్పాట్‌గా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్‌మానేరు ప్రాజెక్టు వెబ్‌ సిరీస్‌ పాటల చిత్రీకరణకు వేదికగా మారుతోంది. ప్రాజెక్టు డౌన్‌ స్ట్రీమ్, వరదకాలువ పరిసరాలతోపాటు, ప్రాజెక్టు బ్యాక్‌వాట ర్‌ ఏరియాలో ప్రముఖ టీవీ ఛానళ్లు సీరియల్స్‌ షూటింగ్‌ నిర్వహించడం విశేషం. పలువురు లోకల్‌ టాలెంట్‌ కళాకారులు, యూ ట్యూబ్‌ ఛానల్స్‌ వారు పలు జానద గేయాలు చిత్రీకరిస్తున్నారు. 

వరదకాలువ వద్ద మంచు లక్ష్మి షూటింగ్
గత జనవరి మొదటి వారంలో వెబ్‌ సిరీస్‌ ఆన్‌లైన్‌ షూటింగ్‌ నిమిత్తం ప్రముఖ నటుడు మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మితో దేశాయిపల్లి వరదకాలువ వద్ద షూటింగ్‌ నిర్వహించారు. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ వరదకాలువపై నుంచి ఓ అమ్మాయి నీటిలో దూకే సీన్‌ చిత్రీకరించారు. ఇందులో మంచు లక్ష్మి గ్రామ పెద్ద పాత్ర పోషించారు. 

బ్యాక్‌ వాటర్‌ ఏరియాలో టీవీ సీరియళ్ల చిత్రీకరణ సందడి
వారంక్రితం మిడ్‌మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామం వరదవెల్లి బ్యాక్‌ వాటర్‌ పరిసరాల్లో  మా టీవీ నిర్మిస్తున్న కస్తూరి సీరియల్‌ షూటింగ్‌ సందడి చేసింది. అగ్నిసాక్షి సీరియల్‌ ఫేం హీరోయిన్‌ ఐశ్వర్య, సూర్య, గౌతంరాజు నటించారు. వైద్యశిబిరం జరిగే సన్నివేశం చిత్రీకరించారు. మూడురోజులపాటు షూటింగ్‌ చేశారు.


                                 వారంక్రితం జరిగిన సీరియల్‌ షూటింగ్‌ దృశ్యం 

జానపద గీతాలు..
మిడ్‌మానేరు ప్రాజెక్టు పరిసరాల్లో లోకల్‌ టాలెంటెడ్‌ కళాకారులు పలు జానపద గీతాలు చిత్రీకరించారు. కరీంనగర్, వేములవాడ ప్రాంతాలకు చెందిన పలువురు జానపద కళాకారులు తమ టాలెంట్‌తో నిర్వహించే గీతాలు చిత్రీకరిస్తున్నారు. మండలంలోని కొదురుపాకకు చెందిన జానపద కళాకారుడు కత్తెరపాక శ్రీనివాస్‌ పలు ప్రేమ గీతాలతోపాటు, జానపద గీతాలు చిత్రీకరించారు.  

ప్రాజెక్టు అందాలు అద్భుతం
మెరుగు యూట్యూబ్‌ ఛానల్‌ ఆధ్వర్యంలో నిర్మించిన సరియా.. సరియా.. అనే గీతంలో నటించా. ప్రాజెక్టు గేట్ల పరిసరాల్లో పాట చిత్రీకరించారు. గేట్ల మీదుగా నీరు వెళ్తుండగా సాంగ్‌లో నటించడం ఎంతో మధురానుభూతిని అందించింది. – అశ్రుత, నటి, హైదరాబాద్

ప్రాజెక్టు వద్ద సందడి
మాన్వాడ వద్ద గల మిడ్‌మానేరు ప్రాజెక్టు పరిసరాలు షూటింగ్‌కు వేదికయ్యాయి. ప్రాజెక్టు గేట్లు, బ్యాక్‌ వాటర్‌ పరిసరాల్లో వివిధ యూట్యూబ్‌ ఛానల్స్‌ వారు పలు జానపద గీతాలు చిత్రీకరిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు పరిసరాల్లో సందడి నెలకొంది. దీంతో గ్రామానికి సందర్శకుల తాకిడి పెరిగింది. – రామిడి శ్రీనివాస్, సర్పంచ్, మాన్వాడ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top