బెంజి కార్లలో వచ్చి కల్లు తాగుతున్నారు.. 

Medicinal Properties That Reduce 15 Diseases In Kallu Says Srinivas Goud - Sakshi

కల్లులో 15 రోగాలను తగ్గించే గుణాలు 

శివాజీ సమకాలికుడు సర్వాయి పాపన్న 

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

రఘునాథపల్లి: కల్లులో 15 రోగాలను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలడంతో ఇప్పుడు బెంజి కార్లలో తిరిగే వారు కూడా వచ్చి కల్లు తాగుతున్నారని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండెలగూడెంలో ఏర్పాటుచేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలసి ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్లులో కేన్సర్‌ను నాశనం చేసే గుణం ఉంటుందని, ఇటీవల ఈ అంశంపై ఓ పత్రికలో పరిశోధన వ్యాసం వచ్చిందని చెప్పారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు.

400 ఏళ్ల క్రితమే సామాజిక న్యాయం కోసం పోరాడిన పాపన్న, శివాజీకి సమకాలికుడని చెప్పారు. పాపన్న కోటలను పర్యాటక కేంద్రాలుగా మార్చి, చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. అనంతరం మంత్రి నర్మెట మండలంలోని బొమ్మకూర్‌ రిజర్వాయర్‌లో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, కలెక్టర్‌ నిఖిలతో కలసి చేపపిల్లలను వదిలారు. తర్వాత లింగాలఘణపురం మండలంలోని నవాబుపేట రిజర్వాయర్‌ కట్ట వద్ద ఈత, ఖర్జూర మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాల్లో బీసీ సంఘం రాష్ట్ర అ«ధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ సురేశ్‌రాథోడ్, ఈఎస్‌ మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top