చేతులు మారిన వందల ఎకరాలు.. తేలింది 66 ఎకరాలే!

Medak Collector Says Will Take Strict Action Who Grabs Assigned Lands - Sakshi

మాసాయిపేట మండలంలో చేతులు మారిన వందల ఎకరాలు 

మొత్తం ప్రభుత్వ భూమి 579.22 ఎకరాలు..  

ఈటలపై విచారణలో తేలింది 66 ఎకరాలు  

మిగతా వారిపై చర్యలు తీసుకుంటారా అని జోరుగా చర్చ 

జిల్లాలో 21వ మండలంగా ఇటీవల ఏర్పడిన మాసాయిపేటలో అసైన్డ్‌ భూముల కబ్జా  వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా   చర్చనీయాంశంగా మారింది. ఈటల    రాజేందర్‌ కుటుంబీకులపై పలువురు రైతులు నేరుగా సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడం, విచారణలో నిబంధనలకు విరుద్ధంగా సుమారు 66 ఎకరాలు కబ్జా చేశారని     తేలిందని కలెక్టర్‌ హరీశ్‌ చెప్పడం ఇప్పుడు  హాట్‌టాపిక్‌గా మారింది. మొత్తం ప్రభుత్వ భూములు 579.22 ఎకరాలు కాగా మిగతా భూమి చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కొనుగోలు చేసిన వ్యక్తులపైనే చర్యలు తీసుకుంటారా లేక వారికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారా అనే చర్చ సాగుతోంది.
– వెల్దుర్తి(తూప్రాన్‌)   

ఈటల రాజేందర్‌ కుటుంబీకులకు అసైన్డ్‌ భూముల బదలాయింపులో గతంలో వెల్దుర్తి తహసీల్దార్‌గా పనిచేసిన ఓ అధికారితో పాటు ఇన్‌చార్జి తహసీల్దార్‌గా పనిచేసిన మరో అధికారి పాత్ర కూడా ఉన్నట్లు డాక్యుమెంట్‌ల బదలాయింపును బట్టి తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశంతో శనివారం అచ్చంపేట, హకీంపేటలో సర్వే చేపట్టిన అధికారుల బృందంలో గతంలో ఈటల కుటుంబీకులకు అనుకూలంగా వ్యవహరించిన తహసీల్దార్‌ కూడా ఉండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అతను ఏ మేరకు సక్రమంగా విధులు నిర్వర్తించారు. తనకు అప్పగించిన సర్వేలో మాజీమంత్రి ఈటల కుటుంబీకులకు అనుకూలంగా ఇచ్చారా లేక వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారా అని పలువురు గ్రామస్థులు చర్చించుకోవడం కనిపించింది. 

హల్దీ ప్రాజెక్ట్‌ నిర్వాసితులు, పేదలకు పంచిన సీలింగ్‌ భూములు.. 
మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామ శివారులో సయ్యద్‌ అహ్మద్‌ అలీఖాన్‌ పేరిట సుమారు 2,054 ఎకరాల పట్టా భూమి ఉండేది. అతని మరణానంతరం భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూమార్తె నుంచి అట్టి భూమిని హకీంపేట పంచాయతీ పరిధి గోపాల కృష్ణాపురానికి చెందిన 33మంది వ్యక్తులు గతంలో కొనుగోలు చేశారు. సీలింగ్‌ యాక్ట్‌ ప్రకారం ప్రభుత్వం కేవలం 14 మంది కొనుగోలుదారుల నుంచి 2,054 ఎకరాల్లో 579.22 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. ఇట్టి భూమిని హకీంపేట గ్రామ శివారులో నిర్మించిన హల్దీ ప్రాజెక్ట్, కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారితో పాటు మాసాయిపేట మండలంలోని హకీంపేట, అచ్చంపేట, చిన్నశంకరంపేట మండలంలోని దర్పల్లి గ్రామానికి చెందిన పలువురు ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు కుటుంబానికి మూడు ఎకరాలు, బీసీ కుటుంబాలకు 1.20 ఎకరాల చొప్పున కేటాయించి పట్టా సర్టిఫికెట్‌లు     అందజేశారు.   

భూ కబ్జాలపై చర్యలు శూన్యం.. 
ఉమ్మడి వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట, రామంతాపూర్‌ గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో విలువైన అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతం అయ్యాయని గతంలో అధికారులకు పలువురు ఫిర్యాదులు చేసినా, భూ కబ్జా వ్యవహారంపై సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాలపై అధికారులు తూతూమంత్రంగా స్పందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ అక్రమాలపై సర్వేలు చేపట్టి    స్వాధీనం చేసుకుంటామని తూప్రాన్‌ ఆర్డీఓ శ్యాంప్రకాశ్‌ ఇచ్చిన హామీలు నీటిమీద రాతలుగానే మిగిలాయని వాపోతున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం తదనంతరం వాటిపై దృష్టి పెట్టకపోవడంతో భూ అక్రమాల వ్యవహారం మండలంలో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెల్దుర్తి ఉమ్మడి మండలంలో అన్యాక్రాంతం అయిన భూములను రక్షించాలని పలువురు కోరుతున్నారు. 

అక్రమార్కులపై కఠిన చర్యలు 
హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో అసైన్డ్‌ భూముల క్రయ, విక్రయాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అక్రమార్కులతో పాటు వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలోనూ చేతులు మారిన అసైన్డ్‌ భూములపై కూడా విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములను అమ్మడం, కొనడం చట్టవిరుద్ధం. ఇందుకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదు. మాసాయిపేట మండలంలోని రామంతాపూర్, మాసాయిపేట గ్రామాల్లో అన్యాక్రాంతం అయిన భూముల వ్యవహారంపై కూడా విచారణ చేపడతాం. – హరీశ్, కలెక్టర్‌ 

ఈటలకే పరిమితమా లేక.. 
మాసాయిపేట మండలంలోని హకీంపేట, అచ్చంపేట గ్రామాలతో పాటు చిన్నశంకరంపేట మండలంలోని దర్పల్లికి చెందిన పలువురు రైతులకు ప్రభుత్వం కేటాయించిన 579.22 ఎకరాల్లో ప్రస్తుతం సగానికి పైగా చేతులు మారినట్లు సమాచారం. ఈటల కుటుంబీకులు 66ఎకరాల్లో పాగా వేసినట్లు తేలగా మిగిలిన వాటిలో ఇతర వ్యక్తులు కబ్జాలో కొనసాగుతున్నారు. ఎస్సీ, ఎస్టీల నుంచి కొనుగోలు చేసిన వారికి గతంలో అధికారులు రికార్డులు బదిలీ చేసినట్లు వినికిడి. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిన అసైన్డ్‌ భూముల కబ్జా పర్వంపై ఉన్నతాధికారులు కేవలం ఈటల కుటుంబీకులపైనే చర్యలు తీసుకుంటారా.. లేక ఇతర వ్యక్తులు కొనుగోలు చేసిన అసైన్డ్‌ భూములపై కూడా విచారించి చర్యలు తీసుకుంటారా అని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top