మహిళ హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు
ఘట్‌కేసర్(హైదరాబాద్): మహిళను హత్యచేసి మృతదేహాన్ని కాల్చిన నిందితుడికి 1వ అడిషనల్ జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. బుధవారం ఇన్‌స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 4, 2021న అంకుషాపూర్ రైల్వేట్రాక్ 218/16–18 మైలురాయి వద్ద ముళ్లపొదల్లో 35–45 ఏళ్లున్న గుర్తు తెలియని మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని దుండగులు ఆమెను అక్కడికి తీసుకొచ్చి గుర్తుపట్టకుండా ముఖం కాల్చివేసినట్లు కేసు నమోదైంది. అప్పటి ఇన్‌స్పెక్టర్ చంద్రబాబు దర్యాప్తు చేయగా.. మృతురాలు నగరానికి చెందిన దినసరి కూలీ కూర వెంకటమ్మగా తేలింది.
సీసీ ఫుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా..
పోలీసులు సీసీ పుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి 18 మందిని హత్య చేసిన నిందితుడు సీరియల్ కిల్లర్ సంగారెడ్డి జల్లా కంది మండలం, ఆరుట్ల గ్రామానికి చెందిన మైనం రాములు (47)గా పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించి దర్యాప్తు తర్వాత చార్జ్‌షిట్ దాఖలు చేశారు. మహిళ హత్య కేసును ఛేదించిన అప్పటి ఇన్‌స్పెక్టర్ చంద్రబాబును పోలీస్ ఉన్నతాధికారులు అభినందించి అవార్డును అందజేశారు. ఇరు వాదనలు విన్న 1వ అడిషనల్ మేడ్చల్ జిల్లా న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదు విధించారు.


