సీసీ కెమెరాలను పైకి తిప్పేసి.. దర్జాగా దోచుకుపోయాడు..

Man Steals Mobile Phones In Khammam - Sakshi

సాక్షి, సత్తుపల్లి: సీసీ కెమెరాలున్నా వాటిని పైకి తిప్పేసి..ఓ దొంగ దోచుకున్న తీరు సత్తుపల్లి పట్టణం బస్టాండ్‌ రింగ్‌ సెంటర్‌లోని చిన్నా సెల్‌ వరల్డ్‌ షాపులో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో రూ.6.50 లక్షల విలువైన సెల్‌ఫోన్లను అపహరించాడు. ఆగంతకుడు అర్ధరాత్రి 1.23 గంటలకు మొదటి అంతస్తు లోపల నుంచి కిందకు దిగి ఒక వైపు తాళం వేసిన ఉన్న షట్టర్‌ను చాకచక్యంగా తెరిచి 1.26 గంటలకు లోనికి ప్రవేశించాడు. ఆ తర్వాత షాపులోని సీసీ కెమెరాలను పైకి తిప్పేశాడు.

సుమారు 40 నిమిషాలకుపైగా షాపులో ఉన్న ఆగంతకుడు షో కేసుల్లోని బ్రాండెడ్‌ సెల్‌ఫోన్లు మాత్రమే ఎంపిక చేసుకొని ఎత్తుకెళ్లాడు. అయితే, షట్టర్‌పైన ఉన్న సీసీ కెమెరాను గమనించకపోవటంతో ఆగంతకుడి కదలికలన్నీ రికార్డు అయ్యాయి. ఎత్తుగా, సన్నగా ఉండి తలకు టోపీ, ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌస్‌ ధరించి ఉండడాన్ని పుటేజీలో పోలీసులు గుర్తించారు. అయితే వచ్చిందా ఒకరా, ఇద్దరా అనేది తేలడం లేదు. కాగా, చోరీ జరిగిన సెల్‌ పాయింట్‌ను కల్లూరు ఏసీపీ ఎన్‌.వెంకటేష్, సత్తుపల్లి పట్టణ సీఐ ఎ.రమాకాంత్‌ గురువారం ఉదయం పరిశీలించారు.

అలాగే, ఖమ్మం నుంచి ప్రత్యేక క్లూస్‌టీం రంగంలోకి దిగి వేలిముద్రలను సేకరించారు. యజమాని వేణుగోపాలరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సుమారు 6.50 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీకి గురైనట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీపీ తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top