ఆ కమిషనర్‌ రూటే సెపరేటు?

Mahabubnagar: Rivalry Between Municipal Commissioner And Councillor - Sakshi

స్థానిక మున్సిపాలిటీలో పాలకవర్గానికి, అధికారులకు మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా శనివారం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మ్యాకల శిరీష అధ్యక్షతన ఏర్పాటు చేసిన కౌన్సిల్‌ సమావేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లతోపాటు అధికార పార్టీ కౌన్సిలర్లు సైతం బహిష్కరించడంతో వివాదం మరోమారు బహిర్గతమైంది.

కోస్గి: ప్రజలచే ఎన్నుకోబడిన కౌన్సిలర్లకే సమాచారం లేకుండా అధికారులు అజెండాలు తయారు చేయడం, కౌన్సిల్‌ ఆమోదించిన పనులు చేపట్టకపోవడం, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కమిషనర్‌పై పాలక సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున స్వామి పనితీరుపై కౌన్సిలర్లు పలుమార్లు జిల్లా కలెక్టర్‌తోపాటు రాష్ట్ర మున్సిపల్‌ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ పేరుతో జిల్లా అధికారులు రావడం, కమిషనర్‌ బదిలీ అంటూ కౌన్సిలర్లు సంబరపడటం తప్పా నేటికీ కమిషనర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

అక్రమ వసూళ్లకు పాల్పడిన పలువురు సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకున్న అధికారులు కమిషనర్‌ను మాత్రం పట్టించుకోకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పట్టణానికి చెందిన పలువురు వ్యక్తుల నుంచి పనులు  చేయడానికి  కమిషనర్‌  డబ్బులు  వసూ లు చేశారనే విషయమై గతంలో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి బాధితుల సమక్షంలోనే విచారణ చేశారు. కార్యాలయ ఖర్చుల నిమిత్తం తీసుకున్నట్లు కమిషనర్‌ సమాధానం ఇవ్వడం బాధితులతోపాటు కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులను విస్మయానికి గురి చేసింది.   

అన్నీ అక్రమాలే.. పట్టించుకునేవారు కరువు
స్థానిక మున్సిపల్‌ కార్యాలయం అక్రమాలకు అడ్డగా మారింది. కొత్తగా ఏర్పడిన మున్సిపల్‌లో ఇంటి పేర్లు మార్చుకునేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక అనుమతులు ఇచ్చిన నేటికీ అమలు చేయకుండా డబ్బులు ఇచ్చిన వారి పేర్లు మాత్రమే మారుస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకాల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న వేతనాల కంటే తక్కువ వేతనం అందిస్తు కార్మికులను వేధిస్తున్నారనేది బహిరంగ సత్యం. కార్మికుల వేతనాలు, నియామకాల్లో అక్రమాలకు సంబంధించి ఫిర్యాదుల నేపథ్యంలో గతంలో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి విచారణ జరిపారు.

అక్రమాలు వెలుగులోకి వచ్చినప్పటికీ చర్యలు మాత్రం శూన్యం. అనుమతులు లేకుండా భవన నిర్మాణాల కు అనాధికారిక అనుమతులు ఇస్తూ మున్సిపల్‌ అధికారులు అందినంత దండుకుంటున్నారు. ఇలా ఒక్కటి కాదు టెండర్‌ నిర్వహించిన నర్సరీల్లో మున్సిపల్‌ కార్మికులతో పనులు చేయించడం, చేయని పనులకు బిల్లులు చేయడం, చేసిన బిల్లులకు కమీషన్‌ వసూలు చేయడం, ఆన్‌లైన్‌ విధానాన్ని పక్కన పెట్టి సగానికి పైగా పనులు నేటికీ కాగితాలపైనే చేయడం వంటి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top