
నేడు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరిక
మరో ఇద్దరు ముగ్గురు మాజీలూ అదే దారిలో..
బీఆర్‌ఎస్ ఖాళీ అవుతుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
స్థానిక ఎన్నికపై దృష్టి.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి అసంతృప్తులను చేర్చుకునే వ్యూహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేరికలపై కమలదళం స్పీడ్ పెంచింది. ఆదివారం కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఇతర ముఖ్య నేతల సమక్షంలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాషాయ గూటికి చేరనున్నారు. మరికొద్ది రోజుల్లో మరో ఇద్దరుముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశాలున్నట్టు పార్టీవర్గాల సమాచారం.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో...బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి మాజీ ఎమ్మెల్యేలతో పాటు జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు నేతలను చేర్చుకునే వ్యూహానికి పార్టీ నాయకత్వం పదును పెడుతోంది. పార్టీ బలహీనంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానికంగా బలం చాటేందుకు వారి చేరికలు ఉపయోగపడతాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.
పార్టీ ఏఏ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బలహీనంగా ఉందనే దాని ప్రాతిపదికన చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ఇతర పార్టీల నుంచి పెద్దసంఖ్యలో చేర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.
ఆపరేషన్‌ను బలపరిచేలా పార్టీ చీఫ్ వ్యాఖ్యలు
బీజేపీలో చేరికలకు సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ‘ఆపరేషన్’ప్రయత్నాలను బలపరుస్తున్నాయి. తమతో బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలోనే వీరి చేరికలు ఉండే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీ మొత్తం ఖాళీ కాబోతున్నదని, అందుకు బీజేపీలో బాలరాజు చేరడమే సంకేతమని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అధికార కాంగ్రెస్ పార్టీలోనూ కొందరు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారు కూడా తమ పార్టీ వైపు చూస్తున్నారన్నారు. వీరంతా కూడా సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని, ఈ రెండు పార్టీల్లోని కొందరు ముఖ్యనేతలతో సహా, మాజీ ఎమ్మెల్యేలకు బీజేపీనే రాజకీయ ప్రత్యామ్నాయం కాబోతోందని చెప్పారు. వీరితోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు కూడా పార్టీలో చేరేందుకు సముఖంగా ఉన్నారంటున్నారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా తటస్థులుగా ఉన్న యువత, మేధావులు, విద్యావేత్తలను బీజేపీలో చేరాలని ఆహ్వానిస్తున్నామని రాంచందర్‌రావు ప్రకటించారు.
మళ్లీ కీలక దశకు..
గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వివిధ స్థాయిల నాయకులు భారీ సంఖ్యలో చేరారు. శాసనసభ కంటే కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కార్యాచరణ విజయవంతమై మంచి ఫలితాలు (మొత్తం 17 సీట్లలో 8 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం) వచ్చాయి. ఈ ఎన్నికలప్పుడు పార్టీలో చేరిన వారే ఆ తర్వాత జరిగిన పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి సత్తా చా టారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కల్లా క్షేత్రస్థాయి నుంచి బలపడేందుకు ఇదే మంచి సమయం, అవకాశమనే అభిప్రా యంతో పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు చేరికల ఆపరేషన్‌కు మళ్లీ పదును పెట్టాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేసినట్టుగా వచ్చిన ఆరోపణలు పెనుసంచ లనానికి కారణమయ్యాయి.
గతంలో బీజేపీలో చేరేందుకు తనను ప్రలోభపరిచిందని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇప్పుడు బీఆర్‌ఎస్ నుంచి చేరికకు ముందువరుసలో నిలిచారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా ఆదివారం బీజేపీలో చేరబోతున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. బాలరాజుతోపాటు త్వరలోనే ఉమ్మడి పాలమూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఇటీవల ఢిల్లీలో బీఎల్ సంతోశ్, ఇత ర నేతలను కలిసి చేరికకు అనుమతి కోరినట్టు తెలుస్తోంది.