చిరుత సంచారం!   | Leopard Wandering In Medak | Sakshi
Sakshi News home page

చిరుత సంచారం!  

Sep 5 2020 9:10 AM | Updated on Sep 5 2020 9:12 AM

Leopard Wandering In Medak - Sakshi

చిరుత సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించిన అటవీ, పోలీసు యంత్రాంగం  

సాక్షి, వర్గల్‌(గజ్వేల్‌): వర్గల్‌ మండలం వేలూరు శివారు వ్యవసాయ క్షేత్రాల్లో చిరుత కనిపించింది. గురువారం రాత్రి వ్యవసాయ పొలాలకు కాపలా వెళ్లిన రైతులకు అక్కడ చిరుత కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పొరుగు రైతులను అప్రమత్తం చేస్తూనే అటవీ అధికారులకు, పోలీసులకు సమాచారం చేరవేశారు. చిరుత భయంతో తమ పాడి పశువులను సంరక్షించుకునేందుకు రాత్రంతా పంట చేల వద్దే మంటలు వేసుకుని జాగారం చేశారు. మండలంలో కలకలం రేపిన చిరుత సంచారం సంఘటనకు సంబంధించి అటవీ అధికారులు, గ్రామ రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వర్గల్‌ మండలం వేలూరు–మీనాజీపేట రోడ్డు మార్గంలో ఎత్తైన గురుమన్‌గుట్ట ఉంటుంది.

ఇక్కడికి సమీపంలోనే ఓ పక్క అడవి, మరోవైపు వేలూరు రైతుల వ్యవసాయ పొలాలు ఉంటాయి. ప్రతి ఏడాది మాదిరిగా రైతులు మొక్కజొన్న తదితర పంటలు సాగు చేశారు. అక్కడే తమ పాడి పశువులను కట్టేసి, రాత్రి వేళ అడవి పందుల బారిన పంటపొలాలు దెబ్బతినకుండా రైతులు కాపలా వెళ్తారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి 10.30–11.00 గంటల ప్రాంతంలో వేలూరు రైతు (గోపాలమిత్ర) ఉప్పరి ఆంజనేయులు తన మొక్కజొన్న చేను కావలికి బయల్దేరాడు. మొక్కజొన్న చేను పక్కనే చెట్టుకింద చిరుతపులి పడుకుని సేదతీరుతున్నట్లు గమనించాడు. అలికిడి విని అది చేనులోకి పరుగులు పెట్టగా భయాందోళనకు గురైన ఆంజనేయులు పొరుగు రైతులకు సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే వారు చిరుత కన్పించిన వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని గజ్వేల్‌ ప్రాంత అటవీ అధికారులకు, గౌరారం పోలీసులకు సమాచారం చేరవేశారు.

చిరుత కన్పించిన ప్రదేశంలో మంటలు వేసి రైతులు నిఘా వేయగా కొద్దిసేపటికి మరోసారి పెద్ద ఆంజనేయులు అనే రైతుకు చిరుత కన్పించి మాయమైపోయింది. ఆ ప్రదేశానికి చేరుకున్న అటవీ డిప్యూటీ ఫారెస్టు రేంజ్‌ అధికారి వేణుగోపాల్, బీట్‌ ఆఫీసర్‌ శ్రావణ్, వాచర్‌ కుమార్, గౌరారం పోలీసులు చిరుత సంచరించినట్లు రైతులు చెప్పిన ప్రదేశాలను పరిశీలించారు. నేల ఎండిపోయి ఉండడంతో చిరుతకు సంబంధించిన పాదముద్రలు మాత్రం కన్పించలేదు. గురువారం చిన్నశంకరంపేట మండలం కామారం తండా గుట్టలలో చిరుత ప్రత్యక్షం కావడం, అదే రోజు రాత్రి వర్గల్‌ మండలం వేలూరు అటవీ ప్రాంత సమీప వ్యవసాయ క్షేత్రాల రైతులు చిరుతను చూసినట్లు చెబుతుండటంతో అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు.  

మరోసారి సందర్శించిన అధికారులు.. 
చిరుత కన్పించినట్లు చెబుతున్న ప్రాంతాన్ని శుక్రవారం మధ్యాహ్నం అటవీ అధికారి వేణుగోపాల్‌ బృందం మరోసారి సందర్శించి పరిశీలించారు. ఎలాంటి ఆనవాళ్లు దొరకనప్పటికీ వేలూరుతో పాటు వర్గల్‌ మండల రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. చిరుత, హైనా తదితర అటవీ జంతువుల బారిన తమ పశుసంపద పడిపోకుండా ఇనుప మెష్‌లతో కూడిన కొట్టాలను రైతులు నిర్మించుకోవాలని సూచించారు. చిరుత కన్పించిన సమాచారం ఉన్నతాధికారులకు చేరవేశామని, వారి ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి వేణుగోపాల్‌ తెలిపారు. కాగా వేలూరులో చిరుత కనపడిందనే వార్త మండలం మొత్తం వ్యాపించడం, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ అధికారులు రైతులను అప్రమత్తం చేస్తూ వీడియోను సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ చేయడంతో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement