‘రాష్ట్రవ్యాప్తంగా వీరందరి పరిస్థితి దారుణంగా ఉంది’ | KTR Call for Farmer Support and Public Accountability | Sakshi
Sakshi News home page

‘రాష్ట్రవ్యాప్తంగా వీరందరి పరిస్థితి దారుణంగా ఉంది’

Apr 25 2026 6:19 PM | Updated on Apr 25 2026 8:12 PM

KTR Call for Farmer Support and Public Accountability

రాజన్న సిరిసిల్ల జిల్లా: కాంగ్రెస్‌ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులందరి పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. తంగళ్లపల్లి మండలం రామనపల్లిలో శనివారం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని తెలిపారు. 100 ఏళ్ల క్రితమే లండన్‌లో చదువుకున్న విశ్వ మేధావి అంబేద్కర్ అని చెప్పారు.

‘అంబేద్కర్ చూపిన బాటలో 14 ఏళ్లుగా లక్షలాదిమందితో పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ 1952-54లో అంబేద్కర్ పార్లమెంటుకు రాకుండా ఓడించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా ఇతర పార్టీ నుంచే భారతరత్న వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి కులానికి, మతానికి అండగా నిలిచాం. 

దురదృష్టవశాత్తు మనం ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నాం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధును నెలకు ఒకసారి ఎకరానికి కిస్తుల ద్వారా ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి కోటి మందిని కోటీశ్వరులను చేస్తానన్నారు.. ఇప్పటికీ పింఛన్లు కూడా సరిగా ఇవ్వడం లేదు. అంబేద్కర్ రాజ్యాంగంలో అందరికీ ఓటు హక్కు కల్పించారు. ఆ ఓటు హక్కు వినిగించుకునేటప్పుడు ఆలోచించి వేయాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. నెల రోజుల క్రితం వడ్లు తీసుకువచ్చి సెంటర్లలో వేసినా ఇప్పటివరకు ఒక గింజ కొన్న పాపాన పోలేదు. ప్రభుత్వం వడ్లు కొనాల్సి వస్తే మద్దతు ధరతో పాటు, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కొనుగోలులో జాప్యం చేస్తోంది. రైతులే వడ్లను దళారులకు అమ్ముకునే పరిస్థితిని వస్తోంది.

రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వీరు రైతుబంధు వేయడం లేదు.. కరెంట్ సరిగా ఇవ్వడం లేదు. వడ్లను కొనుగోలు చేయకపోవడంతో వర్షం కురుస్తుందనే భయంతో రైతులు పంటను కవర్లతో కాపాడుకోవాల్సి వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులందరి పరిస్థితి దారుణంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎన్నడూ చూడలేదు. వెంటనే వడ్ల కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement