‘వాహనదారులారా.. కళ్లు తెరవండి.. విలువైన ప్రాణాలు పణంగా పెట్టకండి’

Kompally Sri Chaitanya Students Awareness Rally On Road Safety - Sakshi

ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా 13 లక్షలమంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఇక గాయపడ్డ వారి సంఖ్య అయిదు కోట్లమంది కంటే ఎక్కువే. అంటే ప్రతి మూడు నిమిషాలకొకరు ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు. ఇక ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశాల్లో భారతదేశమే ముందుంది. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట నెత్తురోడుతున్న దేశం మనది. దేశీయ రహదారుల పొడవు 47లక్షల కిలోమీటర్లయితే 27 శాతానికి పైగా రోడ్డు ప్రమాదాలు నేషనల్‌ హైవేల మీదనే జరుగుతున్నాయి. 

ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. జాగ్రత్తలు మరిచి ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు కొందరు. వీరి వల్ల అమాయకులు ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ట్రాఫిక్‌ పట్ల చైతన్యం పెంపొందించేందుకు కొంపల్లి శ్రీ చైతన్య K5 పాఠశాల విద్యార్థులు నడుం బిగించారు. తమ వంతు బాధ్యతగా కొంపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఉల్లంఘించడం, హెల్మెట్‌ ధరించకపోవటం,సైలెన్సర్లు తీసేసి భారీ శబ్దంతో హారన్‌లు మోగించుకుంటూ నడపటం, ఫుట్ పాత్‌లపైకి దూసుకురావడం..

రాంగ్‌ రూట్‌లలోకి రావడం, పరిమితికి మించి వేగంగా వాహనం నడపడం, మద్యం తాగి రోడ్డెక్కడం.. ఇలా ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలపై చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు విద్యార్థులు. వాహనం జాగ్రత్తగా నడపడంతో పాటు అంబులెన్స్‌లకు దారివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య ఏజీఎం జీవీఆర్‌ రావు, కె5 ప్రిన్సిపళ్లు నేతాజీ, సౌజన్య, ఇతర ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు రోదసీ రంగంలో నాసా పరిశోధనలకు సంబంధించి వివిధ కిట్స్‌ను విద్యార్థులకు అందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top