మహిళపై లైంగిక దాడి.. ఖైరతాబాద్‌ డీఐ బాలస్వామి అరెస్టు | Khairatabad Detective Inspector Balaswamy Arrested | Sakshi
Sakshi News home page

మహిళపై లైంగిక దాడి.. ఖైరతాబాద్‌ డీఐ బాలస్వామి అరెస్టు

Oct 12 2026 8:21 AM | Updated on Oct 12 2026 8:40 AM

Khairatabad Detective Inspector Balaswamy Arrested

సాక్షి, హైదరాబాద్‌: ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాల్సిన పోలీసులే.. బాధితుల బలహీనతలను ఆసరాగా చేసుకుంటే? సమస్య పరిష్కారం కోసం ఫిర్యాదుతో పోలీసుస్టేషన్‌ మెట్లెక్కిన మహిళలను మాయమాటలతో లోబర్చుకుంటే? పెళ్లి పేరుతోనో, కేసులో సాయం చేస్తామనే నెపంతోనో లైంగిక దోపిడీకి తెగబడితే? ఇటీవల అమీన్‌పూర్‌ మాజీ, జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, తాజాగా ఖైరతాబాద్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలస్వామిపై నమోదైన కేసులు ఈ ప్రశ్నల్నే తెరపైకి తెచ్చాయి. కంచే చేను మేసిన దైన్యాన్ని తలపించాయి.   

బాధితురాళ్లే లక్ష్యంగా.. 
పోలీసుల వద్దకు వచ్చే మహిళలు చాలామంది కుటుంబ సమస్యలు, గృహహింస, ఆర్థిక ఇబ్బందులు, ఇతర వ్యక్తుల వేధింపులతో మానసిక ఒత్తిడిలో ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఉన్న వారి నుంచి ఫిర్యాదు స్వీకరించి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత సదరు అధికారిపై ఉంటుంది. అలాంటి పోలీసు అధికారి వారితో వ్యక్తిగత పరిచయాన్ని పెంచుకోవడం, అధికారాన్ని ఉపయోగించి ఒత్తిడి చేయడం, పెళ్లి హామీలతో సంబంధాలు కొనసాగించడం వంటి ఆరోపణలు వస్తే ఆ పరిస్థితి దారుణం. బాధితులకు ఒకవైపు వ్యక్తిగతంగా జరిగిన అన్యాయం.. మరోవైపు పోలీసు వ్యవస్థపై నమ్మకం కోల్పోయే పరిస్థితి. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచి్చనప్పుడు బాధితురాలి ఫిర్యాదును తేలిగ్గా తీసుకోకుండా స్వతంత్రంగా దర్యాప్తు చేయాలి. నిందితుడు పోలీసు అధికారి కావడంతో సాక్ష్యాలు ప్రభావితం కావడం, బాధితురాలిపై ఒత్తిడి రావడం వంటి ప్రమాదాలను ముందుగానే అంచనా వేయాలి. ఫోన్‌కాల్‌ రికార్డులు, సందేశాలు, డిజిటల్‌ ఆధారాలు, వైద్య పత్రాలు, ఆర్థిక లావాదేవీలు, సాక్షుల వాంగ్మూలాలను చట్టప్రకారం సేకరించాలి. 

ఇలా చేస్తేనే నిరోధానికి అవకాశం... 
పోలీసు అధికారిపైనే ఆరోపణలు వస్తే.. ఆ వ్యవస్థ ప్రత్యక్ష నియంత్రణలో లేని విజిలెన్స్‌ వంటి వాటిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి కేసు అప్పగించాలి. బాధితురాలు నిర్భయంగా వాంగ్మూలం ఇచ్చేలా మహిళా పోలీసు అధికారి ద్వారా ప్రక్రియ నిర్వహించాలి. చట్టం నిర్దేశించిన సందర్భాల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని వీడియో ద్వారా నమోదు చేయాలి. నిందితుడి నుంచి బెదిరింపులు, రాజీ ఒత్తిళ్లు, ప్రతీకార చర్యలు జరగకుండా రక్షణ కల్పించాలి. బాధితురాలి వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడాలి. మహిళల ఫిర్యాదులను ఏ అధికారి స్వీకరించారు? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కేసు ఏ దశలో ఉంది? అనే అంశాలను ఉన్నతాధికారులు క్రమం తప్పకుండా సమీక్షించాలి. అధికార దుర్వినియోగం నిర్ధారణ అయితే కేవలం బదిలీతో సరిపెట్టకుండా, నిబంధనల ప్రకారం విచారణ పూర్తి చేసి తగిన శిక్ష విధించాలి. 

బాధ్యత ఉన్నతాధికారులదే... 
పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఉండే నమ్మకమే నేర నియంత్రణకు కీలకం. ఫిర్యాదుదారులనే లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని వ్యక్తిగత వ్యవహారంగా కొట్టిపారేయడం ప్రమాదకరం. అదే సమయంలో ఆరోపణల ఆధారంగానే ఎవరినీ దోషిగా ప్రకటించకూడదు. బాధితురాలికి న్యాయం, నిందితుడికి న్యాయబద్ధమైన విచారణ రెండూ సమానంగా ముఖ్యం. ఖాకీ దుస్తులు ధరించిన వ్యక్తి చట్టానికి అతీతుడు కాదనే సందేశం ఉన్నతాధికారుల చర్యల్లో కనిపించాలి. ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారించడం, సాక్ష్యాలను కాపాడడం, బాధితురాలికి భద్రత కలి్పంచడం, నేరం నిరూపితమైతే తగిన శిక్ష పడేలా చూడడం ద్వారా మాత్రమే పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టగలరనేది నిరి్వవాదాంశం.

ఖైరతాబాద్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలస్వామి అరెస్టు 
సాక్షి, సిటీబ్యూరో/సైదాబాద్‌: పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడినట్లు ఖైరతాబాద్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.బాలస్వామిపై సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం బాలస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. బాలస్వామిపై బీఎన్‌ఎస్‌లోని 69, 81, 351(2), 352 సెక్షన్ల కింద కేసు నమోదైంది. బాధితురాలి కథనం ప్రకారం.. నల్లగొండలోని సాయినగర్‌కు చెందిన ఓ మహిళ భర్త 2015లో మెట్లపై నుంచి జారిపడి వెన్నెముక విరగడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే 2016 డిసెంబర్‌లో ఓ అంశానికి సంబంధించి కోర్టు ఇచి్చన ఉత్తర్వుల అమలు కోసం చాంద్రాయణగుట్ట పోలీసుస్టే షన్‌కు బాధితురాలు వెళ్లారు. 

అప్పట్లో అక్కడ అడ్మిన్‌ ఎస్సైగా పనిచేస్తున్న బాలస్వామితో ఈమెకు పరిచయం ఏర్పడింది. ఆ కేసుకు సంబంధించి సంప్రదింపులు జరిపేందుకంటూ బాలస్వామి ఆమె ఫోన్‌ నంబర్‌ తీసుకుని తరచూ ఫోన్‌ చేసేవాడు. తాను అవివాహితుడినని.. 2017 జనవరిలో పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడని బాధితురాలు చెప్పారు. భర్త ఆరోగ్యం క్షీణించడంతో బాలస్వామి ప్రతిపాదనకు అంగీకరించినట్లు ఆమె తెలిపారు. ఈ క్రమంలో  శారీరక సంబంధం ఏర్పడిందని, కర్మన్‌ఘాట్‌లోని అతడి ఇంటికి వెళ్లినప్పుడు మహిళల దుస్తులు కనిపించడంతో ప్రశ్నించగా, అప్పటికే వివాహమైందని వెల్లడించాడని బాధితురాలు పేర్కొన్నారు. పెళ్లి హామీతో మోసం చేసి లైంగికంగా దోపిడీ చేశాడంటూ పోలీసులను ఆశ్రయించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement