జగిత్యాల: మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గుండె ధైర్యమున్న నేత అని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జగిత్యాల జిల్లాలో సోమవారం నిర్వహించిన ‘బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు కేసీఆర్.
అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ రాగానే మొదటి సంతకంతోనే హైడ్రాను ఎత్తిపారేస్తామన్నారు. గరీబోళ్లను ఏడిపిస్తూ మూసీ వెంట పడ్డారని తెలిపారు. మూసీ సుందరీకరణ ఓ రియల్ ఎస్టేట్ దందా అని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను పండబెట్టారని వ్యాఖ్యానించారు.
40 ఏళ్ల నుంచి జీవన్‌రెడ్డితో తనకు మంచి స్నేహం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే జీవన్‌రెడ్డి పార్టీలోకి వచ్చారని తెలిపారు. భిన్న రాజకీయ సిద్ధాంతాలతో వేర్వేరు పార్టీల్లో పనిచేశామని చెప్పారు. జగిత్యాల ప్రాంతం కోసం జీవన్‌రెడ్డి ప్రాణం పెట్టి పనిచేశారని తెలిపారు.
ఎమ్మెల్యేగా మంత్రిగా చిత్తశద్ధితో పనిచేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసమే జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారని చెప్పారు. తన ప్రాంత అభివృద్ధి కోసం జీవన్‌రెడ్డి ఏదైనా చేస్తారని తెలిపారు.
ఆనాడే ఆమరణ దీక్షకు బయల్దేరా..
‘ఇవాళ తెలంగాణ అగమ్యగోచరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడితే తెలంగాణ అనొద్దని నాడు దాడి చేసిన్రు. చంద్రబాబు నాడు కరెంట్ ఛార్జీలు పెంచితే నేను ఉత్తరం రాశా. తెలంగాణా ఉద్యమం చేస్తానని హెచ్చరించా. బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిపిన బాబు పాలనపై ధ్వజమెత్తి ఉద్యమాన్ని ఆరంభించాను.
రోషయ్య 14 ఎఫ్ అని ఓ జీవో తెచ్చి తెలంగాణ వారికి ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నారు. ఆనాడే ఆమరణ దీక్షకు బయల్దేరా. చిదంబరం ప్రకటన తర్వాత హైడ్రామా క్రియేట్ చేశారు. వచ్చిన తెలంగాణాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు క్లిష్టమైన విషయం. బిహార్ లో పని చేస్తున్న జీఆర్ రెడ్డి అనే చొప్పదండి ఇంజనీర్ ను పిలిపించుకుని ప్రణాళిక రూపొందించుకున్నాం. మిషన్ కాకతీయ వంటి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చాం. మిషన్ భగీరథ పూర్తి చేయకుంటే ఓట్లడగనని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా.. నేను తప్ప..?’ అని వ్యాఖ్యానించారు.
100% బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది..
చీకట్లో దడుసుకుంటే చెట్టే నీ చుట్టూరా భయపెడతదంటూ జగిత్యాల దివంగత కవి అలిశెట్టి ప్రభాకర్‌ను గుర్తు చేసుకున్నారు కేసీఆర్. ‘జీవన్ రెడ్డి జగిత్యాలకు మాత్రమే పరిమితమైన నాయకుడు కాదు.. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది. నేను ముఖ్యమంత్రి అయ్యాక కరీంనగర్ లో నన్ను బోర్నపల్లి గురించి అడిగిండు.
తన నియోజకవర్గం పట్ల జీవన్ రెడ్డి కన్సర్న్ ఏంటో అందరికీ తెలిసిందే. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరితే మంచి ప్రభావం ఉంటుందని సర్వేల్లో కూడా చాలా మంది చెప్పారు. నేను, జీవన్ రెడ్డి ఇకపై ఒక కుటుంబంలా, అన్నదమ్ముల్లా పని చేయనున్నాం. నూరు శాతం బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది. జీవన్ రెడ్డిని మంచి పదవిలో చూస్తారు. ఈ కాంగ్రెసోళ్లు రాగానే కరెంట్ కాకెత్తుకుపోయింది. అనేక చోట్ల రైతుల పొలాలు ఎండుతున్నాయి. రైతులు చనిపోతున్రు. గుండెల్లో తడి లేని దుర్మార్గులు గెలిస్తే రైతుబంధుకు రాం రాం పాడిన్రు. లోన్స్ మాఫీ అన్నాడు ఐనయా? అడ్డమైన హామీలతో ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్. 1.7 శాతంతో బీఆర్ఎస్ ఓటమి పాలైంది.
వచ్చినోళ్లు మంచిగా పని చేయాలిగా..? చిల్లర మాటలు తప్ప ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క నిర్మాణాత్మక పథకం చేపట్టిందా? బంగారుమయమైన తెలంగాణను రెండున్నర ఏళ్లల్లో ఆగం చేసిన్రు. దుకాణాల్లో లేని బస్తాలు యాప్ లో వస్తయా? కాంగ్రెస్ వస్తే చెప్పులతో క్యూలు తప్పుతలేవు. ఇది అసమర్థమైన ప్రభుత్వం.తెలంగాణా ఆగమాగమైపోయింది. రిటైర్డ్ ఉద్యోగుల నుంచి అన్నివర్గాల ప్రజలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది’ అని తెలిపారు.


