
కేసీఆర్‌తో సమావేశమైన కేటీఆర్, హరీశ్‌రావు, లింగయ్య ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, జగదీశ్‌రెడ్డి
ఆస్పత్రిలో పార్టీ నేతలతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
నాసిరకం పాలనతో రాష్ట్రానికి తీరని అన్యాయం
సాగునీటి రంగంపై పాలకులకు తోక తెలియదు... మూతి తెలియదు
నేనే ప్రెస్‌మీట్ పెట్టి బనకచర్ల సహా అన్ని విషయాలు వివరిస్తా
సాక్షి, హైదరాబాద్: ‘సుదీర్ఘ కాలం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది కడుక్కుని తాగేందుకు, కరిగించుకుని తినేందుకు కాదు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వెనుక ఉన్న గాఢతను అర్థం చేసుకునే తెలివితేటలు ప్రస్తుత పాలకులకు లేవు. రొడ్డకొట్టుడు ఉపన్యాసాలతో, నాసిరకం పాలనతో రాష్ట్రానికి తీరని నష్టం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. నీళ్ల కోసమే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పుట్టిందనే విషయం అందరికీ తెలుసు. కానీ ప్రస్తుత పాలకులకు సాగునీటి రంగంపై అవగాహన లేకపోవడంతో జరుగుతున్న నష్టంపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది.
ఒకటి రెండు రోజుల్లో నేను స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి అన్ని విషయాలు ప్రజలకు వివరిస్తా’అని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పార్టీ నేతలతో అన్నారు. వైద్య పరీక్షల కోసం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌ను పలువురు పార్టీ నేతలు శుక్రవారం పరామర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లతో కేసీఆర్ ఇష్టాగోష్టి నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు తదితర ప్రజా సమస్యలు, వర్తమాన అంశాలపై మూడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ సాగు నీటి రంగంపై ప్రస్తుత పాలకులకు కనీస అవగాహన లేదు. వారికి తోక తెలియదు.. మూతి తెలియదు. బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టంపై నేనే స్వయంగా ఆదివారం (సూచనప్రాయంగా) మీడియాతో మాట్లాడతా. నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేడు సాయంత్రం డిశ్చార్జి అయిన తర్వాత నందినగర్ నివాసంలోనే ఉంటా’అని కేసీఆర్ తెలిపారు.
కేటీఆర్, హరీశ్‌రావుతో భేటీ
నేతలతో ఇష్టాగోష్టి తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావుతో కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, ప్రజా సమస్యలు, పార్టీ అంతర్గత అంశాలపై చర్చించినట్లు తెలిసింది. బనకచర్లపై తన ప్రెస్‌మీట్ తర్వాత పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చిరుమర్తి లింగయ్య, శంకర్‌నాయక్, పార్టీ నేతలు వాసుదేవరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాకేశ్, నాగేశ్, సతీశ్‌రెడ్డి తదితరులు ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు.