కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌

KCR Introduced New Revenue Act Telangana Assembly At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్:‌ తెలంగాణలో వర్షాకాల శాసనసభ మూడో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు కీలకమైన కొత్త రెవెన్యూ చట్టం బిల్లు, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ప్రవేశ పెట్టిన బిల్లులకు సంబంధించిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకాన్ని హక్కు పత్రంగా పరిగణిస్తామన్నారు. ఇకపై సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారాలను తహశీల్దార్‌కు అప్పగిస్తామని తెలిపారు. భూ వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలోని భూముల హక్కుల రికార్డులు డిజిటల్ స్టోరేజ్‌లో ఉంటాయని తెలిపారు.

కొత్త పట్టాదారు పుస్తకం హక్కుల రికార్డుగా పరిగణిస్తామని వివరించారు. ఆ రికార్డులో పట్టాదారు పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణం అన్ని ఉంటాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములకు ఈ చట్టం వర్తించదని తెలిపారు. జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఏ రకమైన రిజిస్ట్రేషన్‌ కోసమైనా ప్రభుత్వ వెబ్‌సైట్‌ ద్వారా స్లాట్‌ బుక్ చేసుకోవటం తప్పనిసరి అని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ సమయంలో పాస్ పుస్తకం బదిలీ దస్తాలు రిజిస్ట్రార్ సమక్షంలో ఇవ్వాలని చెప్పారు. మ్యూటేషన్‌ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. 

అదే విధంగా వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదని హామీ ఇచ్చారు. వారిని స్కేల్‌ ఉద్యోగులుగా పరిగణిస్తామని తెలిపారు. వీఆర్వోలను ఏదైనా సమానస్థాయి ఉద్యోగానికి బదిలీ చేస్తామని పేర్కొన్నారు. వీఆర్‌ఎస్‌ లేదా స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించేలా చట్టం తీసుకువస్తామని చెప్పారు. రికార్డులను అక్రమంగా దిద్దడం, మోసపూరిత ఉత్తర్వులు చేయ కూడదన్నారు. అక్రమాలకు పాల్పడితే ఉద్యోగులపై చర్యలు, సర్వీసు నుంచి తొలగింపు ఉంటుందని తెలిపారు. తెలంగాణలో సమగ్ర భూ సర్వే చేయిస్తామని తెలిపారు. అన్ని వివరాలతో ధరణి పోర్టల్ ఉంటుందని చెప్పారు. అగ్రికల్చర్‌, నాన్‌ అగ్రికల్చర్‌ విభాగాలుగా ధరణి పోర్టల్ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

ధరణి పోర్టల్‌ను ఎక్కడి నుంచైనా ఓపెన్‌ చేసుకోవచ్చు వివరించారు. ఇకపై ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. నిషేధిత భూములు ఇకపై రిజిస్ట్రేషన్లు కావని స్పష్టం చేశారు. కేసుల పరిష్కారానికి 16 ఫాప్ట్‌ ట్రాక్‌ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తహశీల్దార్లను జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్లుగా చేస్తామని తెలిపారు. వ్యవసాయ భూములను జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేస్తారని చెప్పారు. వ్యవసాయేతర భూములను సబ్‌ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేస్తారని సీఎం కేసీఆర్‌ వివరించారు. ఇక శాసనసభలో మంత్రి కేటీఆర్‌ మున్సిపల్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top