సాఫీ జర్నీకి సై... అందుబాటులోకి మరో మూడు రోడ్లు

K Tarakaramarao Inaugurated Another Three Link Roads - Sakshi

సాక్షి హైదరాబాద్‌/బంజారాహిల్స్‌: నగర ప్రజలకు ప్రయాణ సదుపాయాన్ని సౌలభ్యంగా మారుస్తున్న లింక్‌రోడ్లలో మరో మూడింటికి, అభివృద్ధిపర్చిన మల్కంచెరువుకు సోమవారం మున్సిపల్‌ మంత్రి కె.తారకరామారావు లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ పనుల విలువ దాదాపు రూ.100 కోట్లు. ఎస్సార్‌డీపీలో భాగంగా ప్రధాన రహదారుల్లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్లతో ప్రయాణ సదుపాయం పెరుగుతుండగా, ఆయా ప్రాంతాలను చేరుకునేందుకు లింక్‌రోడ్లు ఎంతగానో ఉపకరిస్తున్నాయని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొన్నారు. 

నందిహిల్స్‌ అండర్‌పాస్‌.. 
జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 51 నందిహిల్స్‌ కాలనీలో అండర్‌పాస్‌గా నిర్మించిన లింక్‌ రోడ్డు వ్యయం రూ. 30 .30 కోట్లు. ఓల్డ్‌బాంబే హైవే (లెదర్‌పార్క్‌) నుంచి  సైలెంట్‌ వ్యాలీ మీదుగా రోడ్‌నెంబర్‌ 45 వరకు నిర్మించిన ఈ లింక్‌ రోడ్డుతో షేక్‌పేట నుంచి రోడ్‌ నెంబర్‌ 45కు వెళ్లేవారికి ప్రస్తుతమున్న 5 కి.మీ దూరం 3.5 కి.మీలకు తగ్గుతుంది. ఈ మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గుతాయి. సర్వీస్‌ రోడ్ల వల్ల షేక్‌పేట–జూబ్లీహిల్స్‌ల మధ్య సాఫీ ప్రయాణం సాధ్యమని అధికారులు పేర్కొన్నారు.  

ఓల్డ్‌ బాంబే హైవే– ఖాజాగూడ రోడ్డు 
ఓల్డ్‌ బాంబే హైవే నుంచి వయా మల్కంచెరువు, చిత్రపురి కాలనీల మీదుగా ఖాజాగూడ రోడ్డు వరకు నిర్మించిన లింక్‌రోడ్డు పొడవు దాదాపు కిలోమీటరు. ఖాజాగూడ రోడ్డుకు వెళ్లాల్సినవారు ఖాజాగూడ జంక్షన్‌కు వెళ్లనవసరం లేకుండా గమ్యస్థానం చేరుకోవచ్చు. పోచమ్మబస్తీ, చిత్రపురి కాలనీ తదితర పరిసరాల వారికి  ఎంతో ప్రయోజనం. అర కిలోమీటరు దూరం తగ్గుతుంది. దీని వ్యయం రూ. 15.07 కోట్లు.

ఖాజాగూడ లేక్‌ – ఓఆర్‌ఆర్‌  
జాతీయ ఉర్దూ యూనివర్సిటీ కాంపౌండ్‌ వాల్‌కు సమాంతరంగా ఖాజాగూడ లేక్‌ నుంచి ఖాజాగూడ– నానక్‌రామ్‌గూడ రోడ్డు వరకు నిర్మించిన ఈ లింక్‌ రోడ్డు పొడవు కిలోమీటరు. ఓల్డ్‌బాంబే హైవే నుంచి (కేర్‌ హాస్పిటల్‌ దగ్గర) ఖాజాగూడ రోడ్డుకు చేరుకోవాల్సిన వారికి ఇది ప్రత్యామ్నాయ మార్గం. దీని వ్యయం రూ. 47.66 కోట్లు.  సీఎస్సార్‌లో భాగంగా మల్కం చెరువును అభివృద్ధి పరిచారు. పరిసరాలను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు 

(చదవండి: స్కిల్, అప్‌స్కిల్, రీ–స్కిల్‌ )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top