ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ
మధ్యాహ్ననికల్లా వెల్లడి!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. స్థానికులు ఇచ్చిన తీర్పు వెలువడనుండగా..అన్ని పార్టీలు, ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు..కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీకి కూడా ఇక్కడ గెలుపు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని బట్టి ఆయా ప్రాంతాలు, బూత్‌ల వారీగా తమకు పడిన ఓట్ల సంఖ్యపై అంచనాలు వేయడంలో పార్టీలు నిమగ్నమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్ననికల్లా ఫలితం వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అంతంత మాత్రంగానే పోలింగ్
బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో..ఇంకా మూడేళ్ల సమయం ఉండగానే జూబ్లీహిల్స్ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ముఖ్యనేతలు, బీఆర్‌ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు, బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆధ్వర్యంలో బండి సంజయ్, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు చురుగ్గా ప్రచారం చేశారు.
ఉవ్వెత్తున సాగిన ప్రచారంతో ఓటింగ్ 55–60 శాతం నమోదవుతుందని భావించారు. కానీ చివరకు 48.42 % మాత్రమే నమోదైంది. మొత్తం 407 పోలింగ్ బూత్‌లకు గాను 34 కేంద్రాల్లో 60 శాతానికి పైగా, 192 కేంద్రాల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. దీంతో ఆయా బూత్‌ల ఓటర్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉదయం 8 గంటలకే మొదలు
పార్టీలు గెలుపోటములపై విశ్లేషణలతో పాటు, వివిధ పోలింగ్ బూత్‌లలో ఆయా వర్గాల వారీగా పోలైన ఓట్లు, పార్టీల వారీగా అనుకూల ప్రాంతాలు, తదితర అంశాల ఆధారంగా విజయావకాశాలను బేరీజు వేసుకుంటున్నాయి. ఉప ఎన్నిక త్రిముఖ పోరుగా సాగితే..అనూహ్య ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయనే ప్రచారం తొలుత జరిగింది. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు, పోలింగ్ శాతం నమోదు, తదితరాలు గమనిస్తే మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు మొదలుపెడతారు. బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలవడంతో అందుకు అనుగుణంగా కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు పది రౌండ్లలో ముగించనున్నారు. లెక్కించే ఓట్లను బట్టి ఎప్పటికప్పుడు ఫలితాలను ఈసీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 15 ప్లాటూన్లతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


