కదల్లేని స్థితిలో ఉన్న శ్రీనివాస్‌ను పెళ్లాడిన పద్మ  

Ideal Marraige On Womens Day At Karimnagar - Sakshi

మహిళా దినోత్సవం రోజు ఒక్కటైన జంట

కరీంనగర్‌టౌన్‌: కండరాల క్షీణత వ్యాధి అతడిని మంచానికే పరిమితం చేసింది. కూర్చోవాలన్నా.. పడుకోవాలన్నా.. అన్నం తినాలన్నా ఒకరు ఉండాల్సిందే. వ్యాధితో నరకయాతన భరించలేక 2012లో మెర్సికిల్లింగ్‌(కారుణ్య మరణం)కు దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి కట్టిన రేకుల షెడ్డు.. వికలాంగుల పింఛన్‌ తప్ప ఎలాంటి ఆస్తులు లేవు. అయినా అతడిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చిందో మహిళ. మూడేళ్లుగా సేవ చేస్తున్న ఆమె మూడు ముళ్ల బంధంతో అతడికి భార్యగా మారింది. మహిళా దినోత్సవం సోమవారం రోజు ఆ జంట ఏకమైంది. కరీంనగర్‌లోని హౌజింగ్‌బోర్డు కాలనీ మధురానగర్‌లో నివాసం ఉంటున్న కట్ల శంకరయ్య, అనసూయ దంపతుల కుమారుడు శ్రీనివాస్‌(48)కు పద్దెనిమిదేళ్ల వయస్సులో ఎడమకాలు శీలమండ వద్ద స్పర్శ లేకుండా పోయింది. 

క్రమంగా కాళ్లు, చేతులు, శరీరానికి పాకింది. వైద్యులు పరీక్షించి కండరాల క్షీణత వ్యాధి సోకినట్లు తెలిపారు. అప్పటి నుంచి శ్రీనివాస్‌ ఆరోగ్యం క్షీణిస్తూ పూర్తిగా మంచానికే పరిమితం అయ్యాడు. తల్లిదండ్రులే సేవ చేసేవారు. మూడేళ్ల క్రితం తండ్రి మృతిచెందాడు. దీంతో శ్రీనివాస్‌కు సపర్యలు చేసేందుకు ఇంటి సమీపంలోనే ఉండే కంచర్ల శాంతమ్మ, గట్టయ్య దంపతుల కూతురు పద్మ(31)ను వేతనానికి నియమించారు. మూడేళ్లుగా సేవలు చేస్తుండడంతో ఇద్దరి మనసులు కలిశాయి. ఈ క్రమంలోనే శ్రీనివాస్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యులను ఒప్పించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో దండలు మార్చుకున్నారు. 

బతుకుపై భరోసా పెరిగింది : శ్రీనివాస్‌
పద్మ నా జీవితంలోకి వచ్చాక బతుకుపై భరోసా పెరిగింది. ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు. కానీ బతికినంత కాలం పద్మతో సంతోషంగా బతుకుతాను. రాత్రి, పగలు తేడా లేకుండా ఎప్పుడు పిలిస్తే అప్పుడు నాకు అన్నీ తానై చూసుకుంటుంది. చావు అంచుల వరకు వెళ్లిన నాకు పద్మ చక్కటి తోడైంది.

బతికున్నంత వరకు  సేవ చేస్తా : పద్మ
శ్రీనివాస్‌ను నా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నా. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. మూడేళ్లుగా సేవ చేస్తున్నా. భార్యగా ఇంకా గొప్పగా చూసుకుంటాననే నమ్మకం నాకుంది. ఒకరి కోసం ఒకరన్నట్లు జీవిస్తం. శ్రీనివాస్‌కు గానీ, నాకు గానీ ఎలాంటి ఆస్తులు లేవు. మా పరిస్థితి చూసి ప్రభుత్వం గానీ, దాతలు గానీ సహకరిస్తే బతికున్నంత వరకు సేవ చేస్తూ ఉంటా.   

 

చదవండి : (73 ఏళ్ల వృద్ధుడికి పెళ్లి ఆశ చూపించి.. రూ.కోటి టోకరా)
(జీతం రూ.7,500.. అయితేనేం మనసు పెద్దది!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top