మైక్రోసాఫ్ట్‌ సహకారంతో ఐసీటీ ‘సైబర్‌ శిక్షా’

ICT Cyber Shikshaa With Help Of Microsoft - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ సెక్యూరిటీ రంగంలో రానున్న మూడేళ్లలో లక్షల ఉద్యోగ అవకాశాలు రానున్నాయని మైక్రోసాఫ్ట్‌ ఫిలాంత్రోపీస్‌ విభాగపు అధ్యక్షులు కేట్‌ బెన్కెన్‌ చెప్పారు. వాటిని అందిపుచ్చుకునేందుకు తాము ఐసీటీ అకాడమీ భాగస్వామ్యంతో ‘సైబర్‌ శిక్షా’ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో సుమారు 400 మంది అధ్యాపకులకు, ఆరువేల మంది ఉన్నత విద్యావంతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్, ఐసీటీ మధ్య ‘సైబర్‌ శిక్షా’కు సంబంధించిన ఒప్పందం శుక్రవారం హైదరాబాద్‌లో కుదిరింది.

ఈ సందర్భంగా కేట్‌ బెన్కెన్‌ మాట్లాడుతూ, 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఉంటుందని, ఒక్క భారత్‌లోనే ఈ సంఖ్య 15 లక్షల వరకూ ఉంటుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ డిమాండ్‌కు తగ్గట్లు నైపుణ్యమున్న వారు లేరన్నారు. ఐసీటీ అకాడమీ సీఈవో బాలచంద్రన్‌ మాట్లాడుతూ, సైబర్‌ సెక్యూరిటీలో మహిళలకు బాగా డిమాండ్‌ ఉందని, అందువల్ల శిక్షణకు ఎంపిక చేసేవారిలో 70 శాతం మంది మహిళలు ఉండే లా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలోని దాదాపు 1,200 విద్యాసంస్థలతో తాము శిక్షణకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నామని, వీటిల్లో 86 తెలంగాణలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ సీవీడీ రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top