నాంపల్లి నుమాయిష్‌ 2024 ప్రారంభించిన సీఎం రేవంత్‌.. సందర్శకులకు మాస్క్‌ కంపల్సరీ!

Hyderabad Nampally Numaish 2024: CM Revanth Reddy Launch Nymaish  - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నుమాయిష్‌ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు(నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు కూడా) పాల్గొన్నారు. ఈసారి కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నుమాయిష్‌ 2024 జరగనుంది. 

నుమాయిష్‌ కోసం ఈసారి 2,400 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. నుమాయిష్‌కు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. మాస్కులు కచ్చితంగా ధరించి రావాలంటూ సందర్శకులను కోరుతున్నారు నిర్వాహకులు. ఈసారి నుమాయిష్‌ నేపథ్యంలో నగరంలో 45 రోజుల పాటు ఆ రూట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. మరోవైపు సర్వీసులను ఎక్కువ సమయం నడిపేందుకు హైదరాబాద్‌ మెట్రో సిద్ధమైంది. ఇక మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణాల నేపథ్యంలోనూ నాంపల్లి రూట్‌లో బస్సులకు ప్రయాణికుల తాకిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది.

నుమాయిష్‌కు టికెట్ ధరలు గతంలో మాదిరే ఉండనున్నాయి. గతేడాది 10 రూపాయలు పెంచి నుమాయిష్ టికెట్ ధర రూ.40గా నిర్ణయించారు. ఇప్పుడు కూడా టికెట్ ధర రూ.40 లుగా కొనసాగించనున్నారు. నుమాయిష్ సాధారణ రోజులలో సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు కొనసాగుతోంది. వీకెండ్స్,సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.

ఈ సంవత్సరం నుమాయిష్ సందర్శన వేళలను నిర్వాహకులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నుమాయిష్ ను సందర్శించేందుకు మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా ఒక్కో రోజు కేటాయించనున్నారు. జనవరి 9న 'లేడీస్ డే' పేరుతో మహిళలను, 31న 'చిల్డ్రన్ స్పెషల్' పేరుతో పిల్లలను నుమాయిష్ ను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తామని నిర్వహకులు తెలిపారు.

నుమాయిష్‌ నిర్వహణ ద్వారా ప్రతీ ఏడాది సుమారు రెండు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడంతోపాటు సుమారు 30 వేల మంది విద్యార్థులకు విద్యావకాశం కల్పిస్తోంది నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top