Hyderabad Metro Rail Charges Likely To Increase - Sakshi
Sakshi News home page

Hyderabad Metro Rail: టికెట్‌ ధరలు పెంచుతారా?

Published Wed, May 18 2022 10:26 AM

Hyderabad Metro rail Charges Likely To Increase - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ చార్జీల భారాన్ని బూచిగా చూపుతూ త్వరలో మెట్రో ధరలను పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మెట్రో రైలు నిర్వహణ భారంగా మారుతున్న నేపథ్యంలో చార్జీల పెంపు అనివార్యమవుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. చార్జీల పెంపు అంశాన్ని హైదరాబాద్‌ మెట్రోరైలు వర్గాలు మాత్రం ధ్రువీకరించడం లేదు. 

►పెరగని ఆక్యుపెన్సీ ఒకవైపు.. మరోవైపు విద్యుత్‌ చార్జీల భారం గుదిబండగా మారిన నేపథ్యంలో సంస్థ రూకల్లోతు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం రోజుకు సరాసరిన రూ.50 లక్షల  నష్టంతో నెట్టుకొస్తున్నట్లు అంచనా. ప్రస్తుతం కోవిడ్‌ కలకలం నుంచి తేరుకున్నప్పటికీ ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో పెరగలేదని నిర్మాణ సంస్థ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

► రెండేళ్ల క్రితం మూడు మార్గాల్లో 4.5 లక్షల ప్రయాణికులతో కళకళలాడిన మెట్రో రైళ్లు.. ప్రస్తుతం 3 లక్షల మందితోనే  రాకపోకలు సాగిస్తున్నాయి. అత్యధికంగా నాగోల్‌–రాయదుర్గం, ఎల్బీనగర్‌– మియాపూర్‌ రూట్లో 1.40 లక్షల చొప్పున ప్రయాణికులు మెట్రోలో జర్నీ చేస్తున్నారు. గతంలో మెట్రో నిర్మాణానికి తీసుకున్న రుణాలు,వాటిపై వడ్డీలు, నిర్వహణ ఖర్చులకు తోడు విద్యుత్‌ చార్జీలు భారంగా మారిన నేపథ్యంలో ఆ భారం ప్రయాణికులపై వేయక తప్పదన్న భావన మెట్రోరైలు వర్గాల్లో వ్యక్తమవుతోంది. 

తెరపైకి చార్జీల పెంపు? 
►ప్రస్తుతం మెట్రోకు హెచ్‌టీ5 (బి) కేటగిరీ కింద విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ప్రతి యూనిట్‌కు డిమాండ్‌ చార్జీలతో కలిపి రూ.5.28 వసూలు చేస్తున్నారు. మే నెల నుంచి ప్రతి యూనిట్‌కు రూ.6.57 వసూలు చేస్తున్నట్లు తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి వర్గాలు పేర్కొన్నాయి. తమకు క్రాస్‌ సబ్సిడీ లేకుండా బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు చేసే అవకాశాలు కల్పించాలని నిర్మాణ సంస్థ వర్గాలు ఈఆర్‌సీని కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కానీ ఈ విషయంపై ఈఆర్‌సీ నుంచి స్పష్టత కరువైంది. ఈ నేపథ్యంలో చార్జీల పెంపు అంశం తెరమీదకు వచ్చింది. పెరిగిన విద్యుత్‌ చార్జీల భారాన్ని ప్రయాణికులపై మోపే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతుండడం  గమనార్హం.  

►మెట్రో నిర్మాణ, నిర్వహణ వ్యయాలు పెరగడం, ఉద్యోగుల జీతభత్యాలు, వడ్డీల భారానికి తోడు కరెంట్‌ చార్జీల పిడుగు నేపథ్యంలో ప్రయాణికులపై భారం మోపక తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం మెట్రోలో కనిష్ట చార్జీ రూ.10 కాగా.. గరిష్టంగా రూ.60 వసూలు చేస్తున్నారు. రోజురోజుకూ నిర్వహణ భారంగా మారుతున్న నేపథ్యంలో ఛార్జీల పెంపు అనివార్యమౌతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని హెచ్‌ఎంఆర్‌ అధికారులు ధ్రువీకరించకపోవడం గమనార్హం.  

Advertisement
Advertisement