తల్లి ద్వారా కడుపులో బిడ్డకు కోవిడ్‌?

Hyderabad Doctor Proved Baby Infected With Covid19 In Womb - Sakshi

పరిశీలన ద్వారా నిరూపించిన హైదరాబాద్‌ డాక్టర్‌ సతీశ్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా ఏడాదిగా మనిషికి ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంది. వ్యాధి లక్షణాలు మొదలుకొని వైరస్‌ వ్యాప్తి వరకూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ మహమ్మారి తల్లి నుంచి గర్భస్థ శిశువుకూ సోకుతుందని నిరూపించారు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ఘంటా సతీశ్‌. లిటిల్‌స్టార్స్‌ పిల్లల ఆస్పత్రిలో పని చేస్తున్న ఆయన ఇటీవలే ఇలాంటి ఓ కేసును గుర్తించడమే కాకుండా.. కరోనాతో పుట్టిన పసిబిడ్డకు విజయవంతంగా చికిత్స అందించారు కూడా. ఇలా తల్లి మాయ ద్వారా బిడ్డకు వ్యాధి వ్యాపించడాన్ని కోవిడ్‌ 19 నియోనాటల్‌ మిస్‌–సి అని పిలుస్తారు. ఆసక్తికరమైన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 

నెలలు నిండిన శిశువుల్లోనే యాంటీబాడీలు.. 
కోవిడ్‌–19 గురించి తెలిసినప్పటి నుంచి వైరస్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఈ వ్యాధి తల్లి నుంచి గర్భంలో ఉన్న బిడ్డకు సోకే అవకాశం లేదు. కానీ గతేడాదిగా కోవిడ్‌తో బాధపడుతున్న గర్భిణులకు వైద్య సాయం అందిస్తున్న డాక్టర్‌ ఘంటా సతీశ్‌ మాత్రం ఈ అంశంతో ఏకీభవించలేదు. పుట్టిన బిడ్డల్లో కోవిడ్‌ లక్షణాలు ఉన్నా.. శరీరంలో యాంటీబాడీలు లేకపోవడాన్ని కొందరిలో గుర్తించారు. కొంతకాలం కింద కొంచెం అటు ఇటుగా జరిగిన నాలుగు కాన్పులతో ఈ అంశంపై ఆయన కొంత స్పష్టత సాధించగలిగారు.

పుట్టిన నలుగురు పిల్లల్లో ఒకరు పూర్తిగా నెలలు నిండిన తర్వాత బయటికి రాగా.. మిగిలిన వారిని 32 వారాల్లోపే బయటకు తీశారు. నెలలు నిండిన తర్వాత పుట్టిన బిడ్డలో మాత్రమే యాంటీబాడీలు ఉండటాన్ని గుర్తించిన సతీశ్‌.. ఇది కచ్చితంగా తల్లి నుంచి గర్భంలోని బిడ్డకు వైరస్‌ సోకడం వల్ల మాత్రమే సాధ్యమైందన్న నిర్ధారణకు వచ్చారు. మిగిలిన ముగ్గురు బిడ్డల్లో వ్యాధి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ‘గర్భస్థ శిశువులకు తల్లి నుంచి ఉమ్మ నీరు దాటుకుని మరీ యాంటీబాడీలు చేరాలంటే కనీసం 32 వారాలు పూర్తయి ఉండాలి. నలుగురు పిల్లల్లో ఒక్కరు మాత్రమే ఈ స్థాయికి చేరుకున్నారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు 32 వారాలు పూర్తి కాకముందే పుట్టగా.. మిగిలిన ఇద్దరు 28, 31 వారాల తర్వాత పుట్టిన వారు’అని డాక్టర్‌ సతీశ్‌ వివరించారు. 

చికిత్స పద్ధతులు మారాలి
గర్భంలో ఉన్న పిల్లలకు తల్లి ద్వారా కోవిడ్‌ సోకిన కేసులు ఇటీవల చాలా అరుదుగా కనిపిస్తున్నాయని డాక్టర్‌ ఘంటా సతీశ్‌ తెలిపారు. అంతర్జాతీయ జర్నల్స్‌తో ఈ విషయమై ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఈ పరిశోధన ద్వారా కోవిడ్‌ సోకిన గర్భిణుల విషయంలో తీసుకునే జాగ్రతలు, అనుసరించాల్సిన వైద్య పద్ధతుల్లో మార్పులు జరగొచ్చని, తద్వారా తల్లి, పిల్లలు ఇద్దరికీ మేలు జరుగుతుందని వివరించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top