హోమియోలో మందు ఉంది

Homeopathy Medicine For Mirchi Crop Telangana - Sakshi

ఎకరానికి రూ.10 వేలు చాలు

అమేయ కృషి వికాస కేంద్రం యజమాని జిట్టా బాల్‌రెడ్డి 

సాక్షి, యాదాద్రి: నల్లతామర పురుగు, నల్లపేను వంటి తెగుళ్లతో నష్టపోతున్న మిర్చి రైతులు పంటకు హోమియోపతి మందులు పిచికారీ చేస్తే తెగుళ్లకు చెక్‌ పెట్టవచ్చని యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురానికి చెందిన అమేయ కృషి వికాస కేంద్రం యజమాని జిట్టా బాల్‌రెడ్డి తెలిపారు.

మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 19 రకాలకు పైగా తెగుళ్లు సోకి లక్షలాది ఎకరాల్లో మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రైతులు మిర్చికి సోకుతున్న చీడపీడల నుంచి పంటను రక్షించుకోవడానికి లక్షల రూపాయలు వెచ్చించి పురుగుమందులు పిచికారీ చేస్తున్నా ఆశించిన ఫలితం ఉండడం లేదు.

వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్‌ జిల్లాలతో పాటు ఏపీలోని కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, కర్ణాటకలోని రాయచూర్, గుల్బర్గా, అలాగే ఒడిశాలోని పలు జిల్లాల్లో మిరప పంటకు తెగుళ్లు సోకి రైతులు భారీగా నష్టపోతున్నారు. 

హోమియోపతి మందులతో..
మనుషులు వివిధ రోగాలకు వాడే హోమియోపతి మందులను ప్రత్యామ్నాయంగా మిర్చిపంట తెగుళ్లకు వాడుకుంటుంటే ఫలితం ఉంటుందని బాల్‌రెడ్డి చెప్పారు. ఎకరాకు రూ.10 వేల ఖర్చు అవుతుందన్నారు. నాట్లు వేసే సమయంలోనే గుర్తించాలి కానీ, ఆలస్యం అయిందన్నారు. ఇప్పటికైనా రైతులు హోమియో మందులను వాడితే నష్టాల నుంచి బయటపడవచ్చని సూచించారు. ముఖ్యంగా తామర పురుగు నివారణకు అర్నేరియాడయోడెమా 30, తూజా 30 హోమియో మందులను పిచికారీ చేయాలని, 20 లీటర్ల నీటిలో 2.5 మి.లీటర్లు పోసి పిచికారీ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. 

ఇండోనేíసియా నుంచి నల్లపేను..
ఇండోనేసియా నుంచి వచ్చిందని చెబుతున్న నల్లపేను తెగులు మిరప పంటపొలాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న మిరప రైతులు తక్కువ ఖర్చుతో లభించే హోమియోపతి మందులను వాడితే ప్రయోజనం ఉంటుందని జిట్టా బాల్‌రెడ్డి తెలిపారు. వరంగల్, గుంటూరు, కృష్ణా, రాయచూర్‌ జిల్లాల్లో తాను సూచించిన హోమియో పతి మందులను వాడి రైతులు ప్రయోజనం పొందుతున్నారని ఆయన వెల్లడించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top