
సాక్షి, హైదరాబాద్: ‘‘నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. అధికారులు ఏం చేస్తున్నారు? ఇది మీ అంతరాత్మలను కదిలించలేదా? ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వీధి కుక్కల నియంత్రణకు మీ వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా?’’అని జీహెచ్‌ఎంసీ అధికారులను హైకోర్టు నిలదీసింది.
ఈ ఘటనకు సంబంధించి బాలుడి తల్లిదండ్రులు పరిహారం పొందేందుకు అర్హులేనని స్పష్టం చేసింది. అధికారులు తీసుకున్న చర్యలేమిటో కోర్టుకు తెలియజేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.
సుమోటోగా విచారణ
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర్ హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఓ కారు సర్వీసింగ్ సెంటర్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం గంగాధర్‌తోపాటు సర్వీసింగ్ సెంటర్‌కు వెళ్లిన నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్‌పై వీధికుక్కలు దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై ఓ పత్రికలో ప్రచురితమైన వార్తను హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం గురువారం దీనిపై విచారణ నిర్వహించింది. బాలుడి మరణం దురదృష్టకరమని జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా వీధికుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.