‘అనర్హత’పై కడియం, సంజయ్‌లకు హైకోర్టు నోటీసులు | High Court notices to Kadiyam Srihari and Sanjay over disqualification | Sakshi
Sakshi News home page

‘అనర్హత’పై కడియం, సంజయ్‌లకు హైకోర్టు నోటీసులు

Mar 27 2026 3:18 AM | Updated on Mar 27 2026 11:53 AM

High Court notices to Kadiyam Srihari and Sanjay over disqualification

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్‌ కుమార్‌ అనర్హత పిటిషన్లలో స్పీకర్‌ తీర్పును సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించగా పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని స్పీకర్‌ కమ్‌ ట్రిబ్యునల్, ఫిరాయింపు శాసనసభ్యులను సీజే ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పిటిషనర్లు వ్యక్తిగతంగా స్పీడ్‌ పోస్టు ద్వారా నోటీసులు అందించేందుకు అనుమతించింది. దానికి సంబంధించిన ఆధారాలను తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. త

దుపరి విచారణ ఏప్రిల్‌ 16కు వాయిదా వేస్తూ గతంలో ఇదే అంశంపై దాఖలైన పిటిషన్లకు వీటిని కూడా జత చేయాలని రిజిస్ట్రీకి సూచించింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టి.ప్రకాశ్‌ గౌడ్, గాంధీ, తెల్లం వెంకట్‌రావు, గూడెం మహిపాల్‌ రెడ్డి, సంజయ్‌కుమార్‌లు కాంగ్రెస్‌లో చేరారని వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్‌ బీఆర్‌ఎస్‌ పిటిషన్లు సమర్పించిన విషయం తెలిసిందే. 

సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన స్పీకర్‌(ట్రిబ్యునల్‌ చైర్మన్‌ హోదాలో) వీరంతా పార్టీ మారలేదంటూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ‘అనర్హత’తీర్పుపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. 

పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎల్‌. వెంకటేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరడం చట్టవిరుద్ధమన్నారు. స్పీకర్‌ తీర్పు అధికారిక ప్రతి అందనందున అది సమర్పించేందుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం ప్రతివాదులైన స్పీకర్‌ కమ్‌ ట్రిబ్యునల్, ఇద్దరు ‘ఫిరాయింపు’ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement