జలదిగ్బంధంలో ఓరుగల్లు

Heavy Rains And Floods In Warangal District CM KCR Rivew - Sakshi

జనజీవనం అతలాకుతలం.. వరదనీటిలో చిక్కుకున్న 421 గ్రామాలు

ప్రాజెక్టులకు వరద పోటు.. ఉగ్రరూపం దాల్చిన వాగులు

నడికుడ వాగులో కొట్టుకుపోయిన ప్రైవేట్‌ బస్సు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : జలప్రళయం.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాను అతలాకుతలం చేసింది. కాలనీలు, గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. రామప్ప, పాకాల, లక్నవరం సహా చెరువులు, కుంటలు మత్తళ్లు దుముకుతుండగా, జంపన్నవాగు, చలివాగు, మోరంచ, కటాక్షపురం వాగులు ఉగ్రరూపం దాల్చాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 421 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మేడారం సమీపంలోని జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మారుమూల ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. చరిత్రలో మొదటిసారిగా జంపన్నవాగు పొంగిపొర్లిందని చెబుతున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లి వద్ద చలివాగు ప్రమాదకర స్థాయికి చేరింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా నడికుడ వాగులో ఓ ప్రైవేట్‌ బస్సు కొట్టుకుపోగా.. అందులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు. లక్నవరం సరస్సులోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో టూరిజం అధికారులు లక్నవరం, బొగతలకు సందర్శకులను అనుమతించడం లేదు. ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌ చెరువు మత్తడి ఉధృతి పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే.. చెన్నారావుపేట మండలంలో నర్సంపేట ప్రధాన రహదారిపై ఉన్న లోలెవల్‌ కాజ్‌వే పై నుంచి నీరు ప్రవహిస్తున్నది. దీంతో నర్సంపేట వైపు రాకపోకలు ఆగిపోయాయి. భూపాలపల్లి ఏరియాలో సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో బొగ్గు ఉత్పిత్తి నిలిచిపోయింది

నీట మునిగిన కాలనీలు 
వరంగల్‌ మహానగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కాలనీలన్నీ జలమయమయ్యాయి. హన్మకొండ నయీంనగర్‌ దగ్గర ‘నాలా’పొంగడం.. చింతగట్టు దగ్గర రోడ్డు పైన నీళ్లు వెళ్లడంతో కరీంనగర్‌ రహదారి వైపు శనివారం రాత్రి వరకు రాకపోకలు నిలిచాయి. ఖిలా వరంగల్‌ పరిధిలోని ఉర్సు బీఆర్‌ నగర్‌ నీట మునిగింది. దాదాపు 500 ఇళ్లలోకి నీరు చేరింది. గిర్మాజీపేట, శివనగర్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద వరద నీరు ముంచెత్తడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. హన్మకొండలోని అంబేద్కర్‌ నగర్, కాకతీయ కాలనీ వడ్డెర వీధి ముంపునకు గురయ్యాయి. నగరంలోని ములుగు రోడ్డు వద్ద ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సమ్మయ్యనగర్‌ పూర్తిగా మునిగిపోవడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోపాలపురం చెరువు ప్రమాదకరంగా మారింది. పైగా చెరువుకు గండి పడే అవకాశం ఉన్నట్లుగా తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 

ప్రాజెక్టులకు వరద పోటు  
భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద తాకిడి పెరిగింది. కాళేశ్వరం వద్ద శనివారం 10.10 మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం ఉంది. దిగువన కన్నెపల్లిలోని లక్ష్మీపంపుహౌస్‌ వద్ద 7 లక్షల క్యూసెక్కులు తరలిపోతోంది. అలాగే, మహదేవపూర్‌ మండలం అన్నారంలోని సరస్వతీ బ్యారేజీలో మానేరు నుంచి వరద తాకిడి పెరుగుతుండటంతో 66 గేట్లకు గాను 51గేట్లు ఎత్తారు. మానేరు వాగుతో పాటు ఇతర వాగుల ద్వారా బ్యారేజీకి ఇన్‌ఫ్లో 3.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లు ఎత్తడంతో దిగువకు అవుట్‌ఫ్లో 4 లక్షల క్యూసెక్కుల వరద తరలిపోతుందని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. అలాగే, గోదావరి, ప్రాణహిత నదుల నుంచి భారి ప్రవాహాలు వస్తుండటంతో లక్ష్మీబ్యారేజీలో 85 గేట్లకు గాను 65 గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు.
 
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక! 
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శనివారం తెల్లవారుజామున నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో కేంద్ర జల వనరుల శాఖ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, సాయంత్రం 6 గంటలకు 46 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరికకు రెండు అడుగుల దూరంలోనే ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఆ నీటిని సైతం గోదావరిలోకే వదులుతుండటంతో నది ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే పాలేరు, వైరా రిజర్వాయర్లు అలుగుపోస్తున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టుకు గరిష్ట స్థాయిలో నీరు చేరడంతో 12 గేట్లు ఎత్తి 86 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టు పరిధిలోని 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 2016 తర్వాత ఒకేసారి 12 గేట్లు ఎత్తడం ఇదే ప్రథమం. ఇక జిల్లావ్యాప్తంగా శనివారం 16.18 సెం.మీ. వర్షపాతం నమోదైంది.  

అప్రమత్తంగా ఉండండి 
అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులతో మాట్లాడారు. జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్‌లో రెండు కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండాలని, కలెక్టర్, పోలీస్‌ అధికారులతో కలసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. చాలా చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని ఫలితంగా కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని, అలాగే వరదల వల్ల రోడ్లు తెగిపోయే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్థితి ఉత్పన్నం కావచ్చని సీఎం చెప్పారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ రెండు జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు రెండు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వీటిని వినియోగించనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top