హైదరాబాద్‌లో కుంభవృష్టి.. రెడ్‌ అలర్ట్‌ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కుంభవృష్టి.. రెడ్‌ అలర్ట్‌

Published Tue, Sep 5 2023 6:39 AM

Heavy Rain In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరాన్ని కుంభవృష్టి ముంచెత్తింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో హైదరాబాద్‌లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. నగరవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగానే.. హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏదైనా సమస్య  ఎదురైతే సాయం కోసం జీహెచ్‌ఎంసీ హెల్ప్ లైన్ నంబర్ 04-21111111, డయల్ 100, కంట్రోల్‌ రూమ్‌ 9000113667 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తలసాని
భారీవర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా, రోడ్లపై నీరు నిలిచిపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెట్లు, కొమ్మలు కూలిన చోట నుంచి వెంటనే తొలగించాలన్నారు. హుస్సేన్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌, వాటర్‌ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు.

మరో మూడు గంటల పాటు భారీ వర్షం కొనసాగవచ్చని తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో  డీఆర్‌ఎఫ్‌ బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది.  అత్యవసరమైతేనే బయటకు రావాలని నగర వాసులను అధికారులు సూచించారు.

రాత్రి నుంచి కురిసిన వర్షంతో పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. సెల్లార్లు నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు.

అమీర్‌పేట, ఖైరతాబాద్‌, సోమాజిగూడ, సికింద్రాబాద్‌, బేగంపేట, మారేడుపల్లి, ఎల్‌బీనగర్‌, సాగర్‌ రింగ్‌రోడ్‌, హస్తినాపురం,జీడిమెట్ల, నిజాంపేట, కూకట్‌పల్లి, ప్రగతినగర్‌, అల్విన్‌ కాలనీ, చిలకలగూడ, అడ్డగుట్ట, కంటోన్మెంట్‌, బోయిన్‌పల్లి, కర్ఖానా, మోహిదీపట్నం, టోలిచౌకి, షేక్‌పేట, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, దిల్‌షుక్‌ నగర్‌, మలక్‌పేట్‌, కోఠి, ఉప్పల్‌, తర్నాక, మెట్టుగూడలో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరాఫరాకు అంతరాయం ఏర్పడింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతి భారీ వర్షం నమోదు.. మియాపూర్‌లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం, కూకట్‌పల్లిలో 14.3, శివరాంపల్లిలో 13, గాజుల రామారంలో 12.5, బోరబండలో 12.5, జీడిమెట్లలో 12.1, షాపూర్, మూసాపేట్, జూబ్లీ హిల్స్‌లో 12, కుత్బుల్లాపూర్‌లో 11.5, మాదాపూర్‌లో 11.4, సికింద్రాబాద్, రాజేంద్రనగర్‌లో 11.2, బేగంపేట్, కేపీహెచ్‌బీ, అల్వాల్, శేలింగంపల్లిలో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అత్యల్పంగా మల్కాజ్‌గిరి, మౌలాలి పరిధిలో 4 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదు అయినట్లు తెలుస్తోంది.

రాజేంద్రనగర్‌ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ 2 గేట్లు ఎత్తివేశారు. కాసేపట్లో మొత్తం 4 గేట్లు ఓపెన్‌ చేస్తామని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
 

Advertisement
Advertisement