ఎనుముల కాదు..ఎగవేతల రేవంత్‌రెడ్డి | Harish Rao Comments On Revanth Reddy: Telangana | Sakshi
Sakshi News home page

ఎనుముల కాదు..ఎగవేతల రేవంత్‌రెడ్డి

Oct 12 2026 4:58 AM | Updated on Oct 12 2026 4:58 AM

Harish Rao Comments On Revanth Reddy: Telangana

కరెంట్‌ కోతలు,  రైతు బంధు ఎగ్గొట్టడం, రైతు బీమా రద్దు తప్ప చేసిందేమీ లేదు

అన్ని వర్గాల ప్రజలను దగా చేసిన ఘరానా మోసగాడు

ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. సర్కారు వైఫల్యాలతో వచ్చిన కరువు

సిద్దిపేట దశాబ్ది ఉత్సవాల సభలో హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని, వ్యవసాయానికి కరెంట్‌ కోతలు,  రైతు బంధు ఎగ్గొట్టడం, రైతు బీమా రద్దు, బిల్లు­ల చెల్లింపుల కోసం వసూళ్లు వంటివి మాత్రం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ శాసనసభా పక్ష డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ టి.హరీశ్‌రావు విమర్శించారు. సీఎంను ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు..ఎగవేతల రేవంత్‌రెడ్డి అని పిలవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను దగా చేసిన ఘరానా మోసగాడు రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 

ఎప్పుడో ఎదురైన సమస్యలు మళ్లీ తెచ్చారు.. 
‘కేసీఆర్‌ సీఎంగా ఉన్న పదేళ్లలో తెలంగాణలో బోర్‌ బళ్లు, బావుల దగ్గర క్రేన్‌లు కన్పించలేదు. పాత రోజులు తెస్తానని చెప్పిన రేవంత్‌.. ఎప్పుడో గతంలో ఎదురైన వ్యవసాయానికి ఆరు గంటల విద్యుత్, ఓల్టేజీ సమస్యతో ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడం, మోటార్లు కాలిపోవడం వంటి సమస్యలను మళ్లీ తెచ్చాడని, రైతులకు మళ్లీ అవస్థలు తెచ్చాడని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. 

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కరువు
ఏపీ సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి శ్రీశైలం నుంచి రూ.700 కోట్లతో కుప్పంకు నీళ్లు తీసుకువెళ్తున్నా రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని హరీశ్‌ అన్నారు. ‘దేవాదుల మోటార్లు ఆన్‌ చేయకుండా వరంగల్‌ జిల్లా కరువుకు కారణమయ్యాడు. పాలమూరు జిల్లాను ఎండబెట్టారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు..నిర్వహణ వైఫల్యంతో రేవంత్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కరువు..’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు రేవంత్‌రెడ్డి బేషరతుగా చెంపలేసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

జిల్లా అవతరణ పండుగలను ప్రభుత్వం నిర్వహించాలి కానీ.. ఈ పండుగలో కేసీఆర్‌ పేరు చెప్పాలి కాబట్టి అలా చేయలేదన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడానికి సిద్దిపేట నుంచే ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ చిత్ర పటాన్ని హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు వెంకట్రామరెడ్డి, యాదవరెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్, ఇతర బీఆర్‌ఎస్‌ నాయకులు గోదావరి జలాలతో అభిషేకించారు. హరీశ్‌రావు మాట్లాడుతుండగా కరెంటు పోవడంతో సభికులంతా సెల్‌ఫోన్లలోని టార్చిలైట్‌ ఆన్‌ చేసి ఆ వెలుగులో హరీశ్‌ ప్రసంగాన్ని ఆలకించారు.

సిద్దిపేటలో జరిగిన దశాబ్ది ఉత్సవాల సభలో మాట్లాడుతున్న తన్నీరు హరీశ్‌ రావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement