ఏటా ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక, దినసరి ఉద్యోగుల రెన్యువల్ తప్పనిసరి
రాష్ట్రంలో మొత్తం 4.96 లక్షల మంది ఈ తరహా ఉద్యోగులు
కేవలం 45 వేల మంది ఉద్యోగుల రెన్యువల్ ప్రతిపాదనలే ఆర్థిక శాఖకు చేరిన వైనం.. మిగతా 4.5 లక్షల మందికి వేతనాలు అందకుండా పోయే పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ఏకంగా 4.5 లక్షల మందికి ఏప్రిల్ నెల వేతనాలు అందకుండా పోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగులు కాకుండా.. తాత్కాలిక, దినసరి, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ లెక్చరర్లు, చెక్ పేమెంట్స్ ఇలా.. రాష్ట్రంలో 432 వివిధ విభాగాల్లో 4.96 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో రెన్యువల్ చేస్తూ.. మార్చి 31వ తేదీ వరకు పొడిగింపును ఇవ్వడం రివాజుగా వస్తోంది. అయితే ఈసారి ఉద్యోగుల రెన్యువల్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపించడంలో అయా విభాగాల ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఆయా కేటగిరీల ఉద్యోగులు వేతనం అందుకోలేని పరిస్థితి నెలకొనడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
సేవల పునరుద్ధరణపై ఆందోళన
432 విభాగాల్లో కేవలం 40 విభాగాలకు సంబంధించి కేవలం 45 వేల మంది ఉద్యోగుల రెన్యువల్‌కే ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి. మిగిలిన 4.50 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి మంగళవారం వరకు ఆర్థిక శాఖకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదు. దీంతో వీరికి వేతనం కింద అందాల్సిన దాదాపు రూ.1,000 కోట్లు నిలిచిపోనున్నాయి. ఈ ఉద్యోగులందరు ఆన్‌లైన్‌లో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్‌ఎంఐఎస్)లో నమోదు చేసుకున్నారు. వారంతా విధులకు హాజరు అవుతున్నారు. అయితే ప్రస్తుతం వారి సేవలను పునరుద్ధరిస్తారా లేదా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలంటున్న ఉద్యోగులు
ప్రతిసారీ రెన్యువల్ చేయడం కాకుండా ప్రభుత్వం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి తమను ఆ కార్పొరేషన్ ఉద్యోగులుగా చేర్చి, ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ప్రైవేట్ వ్యక్తులకు భారీగా చెల్లించే కమీషన్ల మొత్తం ఆదా అవుతుందని పేర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటకలు ఈ విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశాయని, ఏపీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కార్పొరేషన్ ద్వారా నేరుగా ప్రభుత్వమే వేతనాలు ఇవ్వడం ప్రారంభించినట్లు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకుడు పులి లక్ష్మయ్య పేర్కొన్నారు. ఏజెన్సీలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో పాటు సమాన పనికి, సమాన జీతం ఇవ్వాలని కోరుతూ మే 25 వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ధర్నాకు దిగనున్నట్లు తెలిపారు.
ఏజెన్సీలు, అధికారుల ఒత్తిడితో ‘నలిగిపోతున్నారు’
ఓవైపు ఏజెన్సీలు, మరోవైపు అధికారుల ఒత్తిళ్ల నడుమ ఉద్యోగ భద్రత లేక అనేకమంది ఉద్యోగులు మరణిస్తున్నారని సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా..కొన్ని నెలలుగా వేతనాలు అందని పరిస్థితి ఉందని అంటున్నారు. హైదరాబాద్ ఈఎస్‌ఐ విభాగంలో 300 ఉద్యోగులకు జనవరి నుంచి, నీటిపారుదల శాఖ భూ సేకరణ కార్యాలయం ఉద్యోగులు దాదాపు 256 మందికి 12 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, ఈఎస్‌ఐ నాచారంలో నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని సమాచారం. కాగా అధికారులు ఏజెన్సీలతో కుమ్మక్కవడం వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈపీఎఫ్ చెల్లింపుల దుర్వినియోగం!
అనేక ఏజెన్సీలు తమ సొంత లాభం కోసం ఉద్యోగుల ఈపీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపులను దుర్వినియోగం చేస్తూ, ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీని సైతం ఎగవేస్తున్నాయని లక్ష్మయ్య ఆరోపించారు. పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో సమాన పనికి సమాన వేతనాలు ఇచ్చే పద్ధతి అమల్లో ఉందని, ఇక్కడ కూడా ప్రభుత్వం ఆ దిశలో అడుగులేసి ఔట్ సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు న్యాయం చేయాలని సంఘం నాయకులు కోరుతున్నారు.


