బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో బడా బాబుల కక్కుర్తి

GHMC Officials Noted Illegal Constructions in Banjara Hills, Jubilee Hills - Sakshi

దుకాణాలవుతున్న ‘సెట్‌ బ్యాక్‌’లు!

సంపన్నుల కాలనీలో అక్రమ నిర్మాణాలు

చోద్యం చూస్తున్న అధికారులు

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 67లో మాజీ ఎంపీ సి.ఎం.రమేష్‌ తన ఇంటి సెట్‌బ్యాక్‌లో దుకాణాలను అక్రమంగా నిర్మించగా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చివేశారు. ఈ దుకాణాలను అద్దెకు ఇచ్చుకోవడానికి ఆయన నిర్మించారు.  

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లో ఓ సినీ నిర్మాత, పారిశ్రామిక వేత్త తన ఇంటి సెట్‌బ్యాక్‌ను అక్రమంగా మూడు దుకాణాలను నిర్మించారు. జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు సదరు నిర్మాణదారుడికి నోటీసులు జారీ చేశారు. 

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లో ఓ పారిశ్రామికవేత్త తన ఇంటి సెట్‌బ్యాక్‌లో మూడు అంతస్తుల భవనం నిర్మించి ఓ ఫర్నీచర్‌ షాపు అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 10లో అపార్ట్‌మెంట్‌ను ఆనుకొని సెట్‌బ్యాక్‌లో అపార్ట్‌మెంట్‌ నిర్మించిన బిల్డర్‌ కామన్‌ ఏరియాలో దుకాణాలు నిర్మించగా జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. 

సాక్షి, హైదరాబాద్‌: సంపన్న వర్గాలు నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో గజం స్థలం ప్రస్తుతం రూ. 2.50 లక్షలు పలుకుతోంది. గతంలో తమ ఇంటి ఆవరణలో వెలుతురు, గాలి కోసం చాలా మంది బడా బాబులు చక్కటి ఇళ్లను సెట్‌బ్యాక్‌ వదిలేసి నిర్మించుకున్నారు. ఇప్పటిదాకా బాగానే నడిచింది. అయితే ప్రస్తుతం భూముల ధరలు ఆకాశన్నంటుతుండటంతో పది గజల స్థలాన్ని కూడా ఏ ఒక్కరూ ఖాళీగా వదులుకోవడానికి ఇష్టపడటం లేదు.  

► జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ప్రతి రోడ్డు కమర్షియల్‌ కావడంతో ఈ రోడ్లలో నిర్మించుకున్న ఇళ్ల సెట్‌బ్యాక్‌లు ఇప్పుడు దుకాణాలుగా మారుతున్నాయి.

► గతంలో అనుమతులు తీసుకొని సెట్‌బ్యాక్‌ వదలగా ఇప్పుడు ఆ సెట్‌బ్యాక్‌లోనే అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా చేపడుతున్నారు.

► ఒక వైపు జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు వాటిని నేలమట్టం చేస్తున్నా కొంత మంది యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. పది నుంచి 50 గజాల స్థలం ఉంటే చాలు రెండు మడిగెలు వేసి అద్దెకిస్తున్నారు. ఐస్‌క్రీం షాపులు, టిఫిన్‌ సెంటర్లు, మెడికల్‌షాపులు, ఇలా అద్దెకివ్వడం వల్ల నెల నెలా రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు అద్దె వస్తుండటంతో ఖాళీగా ఉన్న కామన్‌ ఏరియాలను వాణిజ్య ప్రాంతాలుగా మారుస్తున్నారు.  

87 అక్రమ నిర్మాణాలు... 
► జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్‌ తదితర సంపన్న వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఇప్పటికే నివాసాల సెట్‌బ్యాక్‌లలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. 87 ప్రాంతాల్లో సెట్‌బ్యాక్‌లు, దుకాణాలుగా రూపాంతరం చెందినట్లుగా రికార్డులు వెల్లడిస్తున్నాయి. చాలా మందికి నోటీసులు జారీ చేసి నా ఉపయోగం లేకుండా పోతున్నది. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరిపి అద్దెలకు ఇస్తున్నారు.  (క్లిక్: ఇల్లు కడుతున్నారా.. వెంటనే పర్మిషన్‌ ఇలా..)

పార్కింగ్‌ స్థలం నో... 
► నివాసాల ముందు, వెనుక భాగాల్లో కామన్‌ ఏరియాలను దుకాణాలుగా  మారుస్తున్న నివాసితులు పార్కింగ్‌ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పార్కింగ్‌తో తమకు సంబంధం లేదని అగ్రిమెంట్ల సమయంలోనే చెప్పేస్తున్నారు. దీంతో రోడ్లపైనే పార్కింగ్‌లు చేసుకుంటూ ఈ దుకాణంలోకి వెళ్లి వస్తున్నారు.  

‘అందరి’ అండదండలు 
► బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో నివాసాల సెట్‌బ్యాక్‌లలో జరుపుతున్న అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు వెళ్తున్న జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఫోన్లు చేస్తూ అటు వైపు వెళ్లవద్దంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో నిర్మాణదారులు యథేచ్ఛగా అక్రమాలకు తెగబడుతున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఎంతో కొంత ముట్టచెబుతూ తమ పని కానిచ్చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top