శుభం భూయాత్‌.. సిలిండర్‌ దేహి | gas shortage creates problems for weddings in visakhapatnam | Sakshi
Sakshi News home page

శుభం భూయాత్‌.. సిలిండర్‌ దేహి

Mar 30 2026 9:42 AM | Updated on Mar 30 2026 10:45 AM

gas shortage creates problems for weddings in visakhapatnam

 వివాహాలకు గ్యాస్‌ సెగ 

 తీవ్ర కొరతతో అల్లాడుతున్న వైనం 

చేతులెత్తేస్తున్న క్యాటరింగ్‌ నిర్వాహకులు

విశాఖపట్నం జిల్లా:  వేల రూపాయలు ఖర్చు చేసి కల్యాణ మండపాలు బుక్‌ చేసుకుని, బంధుమిత్రులకు ఆహ్వాన పత్రికలు పంపి పెళ్లి పనుల్లో మునిగిపోయిన వారికి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. అదే ‘వంట గ్యాస్‌’ కొరత. పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుండటంతో దాని సెగ కాస్తా మన వంటింట్లో గ్యాస్‌ సిలిండర్‌కు తగిలింది. దేశవ్యాప్తంగా గ్యాస్‌ కష్టాలు రెట్టింపు అవుతుండటంతో, విశాఖలోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

ముఖ్యంగా ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు వరుసగా పెళ్లి ముహూర్తాలు ఉండటంతో, కేటరింగ్‌ వ్యాపారులు ఇప్పుడు కఠినమైన షరతులు విధిస్తున్నారు. ‘మీరు సిలిండర్లు ఇస్తేనే మేము వంట చేస్తాం, లేదంటే మా వల్ల కాదు’ అని కేటరింగ్‌ సిబ్బంది, వంట బ్రాహ్మణులు తెగేసి చెబుతుండటంతో పెళ్లి బృందాలు బెంబేలెత్తిపోతున్నాయి. నగరంలో ప్రస్తుతం గ్యాస్‌ బుకింగ్‌ల వెల్లువ కొనసాగుతోంది. 

ఇప్పటికే సుమారు ఒక లక్షా 65 వేల మందికి పైగా గ్యాస్‌ బుక్‌ చేసుకోగా, సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో మొబైల్‌కు ఓటీపీ వచ్చిన వెంటనే సిలిండర్‌ డెలివరీ అయ్యేది. కానీ ఇప్పుడు ఓటీపీ వచ్చి పది రోజులు గడుస్తున్నా గ్యాస్‌ రాని పరిస్థితి నెలకొంది. బుక్‌ చేసిన 25 రోజుల తర్వాత గానీ సిలిండర్‌ వచ్చే సూచనలు కనిపించడం లేదు. అధికారులు మాత్రం గ్యాస్‌ కొరత లేదని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గ్యాస్‌ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు  తీరుతుండటం, నిరీక్షణ కాలం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

బ్లాక్‌ మార్కెట్‌దే హవా.. 
ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు బ్లాక్‌ మార్కెట్‌కు తెరలేపారు. ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ల వినియోగంపై ఆంక్షలు విధించడంతో, గృహ అవసరాలకు వాడే సిలిండర్లకు డిమాండ్‌ అమాంతం పెరిగింది. ఒక్కో సిలిండర్‌పై రూ. 300 నుంచి రూ. 600 వరకు అదనంగా వసూలు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు నిశ్చయించుకున్న వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఎంత ధరైనా వెచ్చించి సిలిండర్లను సమకూర్చుకుంటు న్నారు. యుద్ధ మేఘాలు తొలగి సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ గ్యాస్‌ గండం తప్పేలా లేదని వినియోగదారులు వాపోతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement