
ఒకప్పుడు బెల్లం వ్యాపారంతో గుర్తింపు
ఇక్కడి నుంచే పలు రాష్ట్రాలకు సరఫరా
బెల్లంతో పాటే గంజ్ ఉనికి కోల్పోయింది
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఒకప్పుడు కామారెడ్డి గంజ్ (గాంధీ గంజ్) అంటే.. పేరున్న మార్కెట్. ఏటా రూ.వందల కోట్ల విలువైన బెల్లం వ్యాపారంతో ఘనకీర్తి సాధించింది. కామారెడ్డి పట్టణానికి చుట్టుపక్కల ఉన్న మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన రైతులు కూడా ఇదే మార్కెట్‌కు వచ్చేవారు. ఎడ్ల బండ్లపై బెల్లం ముద్దలు తీసుకొచ్చి ఇక్కడి వ్యాపారులకు విక్రయించేవారు. బెల్లం వ్యాపారంతో మార్కెట్‌కు మంచి ఆదాయం సమకూరేది.
అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ బీఎన్ రామన్ ఆధ్వర్యంలో.. స్థానిక గంజ్ వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, విద్యావేత్తలు అందరూ కలిసి విద్యారంగ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించారు. గంజ్‌లో జరిగే క్రయ విక్రయాలపై కొంత సెస్సును విద్యారంగం కోసం వసూలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే అప్పట్లో 267 ఎకరాల మేర భూమిని సేకరించి.. అందులో భారీ భవనాన్ని నిర్మించారు. ఆ భవనమే ప్రస్తుత ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల.
గంజ్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. ఇదంతా గతం. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం.. బెల్లంపై విధించిన ఆంక్షలతో బెల్లం వ్యాపారం దెబ్బతింది. నల్లబెల్లం అంటూ కేసులు పెట్టడంతో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. బెల్లం కొనుగోళ్లు లేకుండా పోయాయి. రైతులు బెల్లం వండలేని పరిస్థితి ఏర్పడింది.
తరువాత దివంగత సీఎం వైఎస్సార్ బెల్లంపై ఆంక్షలు ఎత్తివేసి రైతులకు అండగా నిలిచారు. ఆయన హయాంలో బెల్లం తయారీతో పాటు వ్యాపారం పుంజుకుంది. కానీ వైఎస్సార్ మరణంతో మళ్లీ బెల్లానికి కష్టాలొచ్చాయి. తరువాత బెల్లంపై ఆంక్షలు మరింత పెరిగి బెల్లం తయారీ లేకుండా పోయింది. దీంతో గంజ్ ఉనికి కోల్పోయింది.
ఉనికి కోల్పోయిన గంజ్
బెల్లంతో పాటు ఇతర పంటల కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగేవి. ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం నడిచేది. అప్పుడు గంజ్ కళకళలాడుతూ ఉండేది. బెల్లంపై ఆంక్షలతో గంజ్ వ్యాపారం దెబ్బతినిపోయింది. బెల్లం దందా నడిచిన అడ్తి దుకాణాల్లో ఇతర వ్యాపారాలు వచ్చాయి. గంజ్‌కు సంబంధించి బెల్లం కొనుగోళ్లు చేసిన షెడ్లు కూడా కనుమరుగయ్యాయి. మూడేళ్ల కిందట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసమంటూ షెడ్లను తొలగించడంతో గంజ్ రూపు కోల్పోయింది.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం కూడా పిల్లర్ల వద్దే నిలిచిపోయింది. గంజ్‌లో మిగిలిందల్లా మార్కెట్ కమిటీ కార్యాలయం, కొన్ని షెడ్లు మాత్రమే. దీంతో గంజ్ ఉనికి లేకుండా పోయిందనే చెప్పాలి. అప్పట్లో నిత్యం గంజ్‌కు వేలాది మంది రైతులు వచ్చేవారు. పంటల సీజన్‌లో అయితే ఎడ్ల బళ్లు వరుస కట్టేవి. పంట ఉత్పత్తులను తీసుకువచ్చి వ్యాపారుల వద్ద అమ్మేవారు.
వ్యాపారులు, రైతుల మధ్య మంచి అనుబంధం
బెల్లం దందా నడిచిన కాలంలో రైతులు, వ్యాపారులకు మధ్యన మంచి అనుబంధం ఉండేది. రైతులు పంట పెట్టుబడి కోసం వ్యాపారుల వద్దే అప్పు తీసుకునేవారు. పంట చేతికందిన తరువాత ఆ పంటను అదే వ్యాపారులకు అమ్మేసి, అప్పు పోను మిగతా డబ్బులు తీసుకునేవారు.
రైతు ఇంట్లో పెళ్లిళ్లు ఉన్నా, ఇళ్లు కట్టుకున్నా సరే వ్యాపారులు అండగా నిలిచేవారు. వ్యాపారులు, రైతుల ఇళ్లలో పండుగలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లకు ఒకరినొకరు ఆహ్వానించుకునేవారు. రైతులు, వ్యాపారుల మధ్య మంచి అనుబంధం ఉండేది. గంజ్ వ్యాపారాలు దెబ్బతిన్న తరువాత రైతులు రావడమే నిలిచిపోయింది. వ్యాపారులు కూడా ఇతర దందాల వైపు మళ్లారు.