
బిహార్‌లో తయారీ ముఠా గుట్టురట్టు చేసిన కామారెడ్డి పోలీసులు
ప్రధాన నిందితుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు
కామారెడ్డి క్రైం: బిహార్‌లోని ఓ మారుమూల ప్రాంతం అడ్డాగా దొంగనోట్లు తయారు చేసే ముఠా గుట్టును కామారెడ్డి పోలీసులు రట్టు చేశారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో వివిధ రాష్ట్రాల్లో దాడులు చేసి 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర ఆ వివరాలు వెల్లడించారు.
రెండు నోట్లతో మొదలైన కేసు..
కామారెడ్డి కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ఓ వైన్స్‌లో గత నెల 23న కామారెడ్డి మండలం షాబ్దీపూర్‌కు చెందిన సిద్దాగౌడ్ మరొకరితో కలిసి రెండు రూ. 500 నోట్లు ఇచ్చి మద్యం కొనుగోలు చేశాడు. వైన్స్ క్యాషియర్ అఖిల్‌కు సిద్దాగౌడ్ ఇచ్చిన నోట్లు నకిలీవనే అనుమానం కలిగి తర్వాత సిద్దాగౌడ్ ఇంటికి వెళ్లి అడిగాడు. తన జీతం డబ్బులు ఇచ్చి మద్యం కొన్నానని సిద్దాగౌడ్ బదులివ్వగా అనుమానం తీరక అఖిల్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి నోట్లు నకిలీవని నిర్ధారించారు.
సిద్దాగౌడ్‌ను అదుపులోకి విచారణ జరపగా నేరం అంగీకరించాడు. ఫేస్‌బుక్‌లో ఫేక్ కరెన్సీ గ్రూపు ద్వారా కోల్‌కతాకు చెందిన సౌరవ్‌డేను పరిచయం చేసుకొ ని రూ.5 వేలు అసలు నోట్లు చెల్లించి రూ.10 వేలు దొంగనోట్లు తెప్పించుకున్నట్లు సిద్దాగౌడ్ తెలిపాడు. కామారెడ్డి నుంచి సీసీఎస్ పోలీసులు బెంగాల్ వెళ్లి సౌరవ్‌డేను పట్టు కొని విచారించగా అతడు హరినాయణ భగత్ అనే వ్యక్తితో కలిసి బిహార్‌కు చెందిన రషీద్ నుంచి దొంగ నోట్లు తెప్పించి కొరియర్ ద్వారా కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్టు తేలింది.
దీంతో మొత్తం వ్యవహారం బయటపడింది. నిందితు లిద్దరితోపాటు సిద్దాగౌడ్, మరో కస్టమర్ అయిన కృత్తిక్ రాజు (తమిళనాడు నుంచి వలస వచ్చి కామారెడ్డి ప్రాంతంలో నివసిస్తున్నాడు) లను అరెస్టు చేసి నాలుగు రోజుల క్రితమే కోర్టుకు హాజరుప ర్చినట్లు ఎస్పీ తెలిపారు.
బృందాలుగా ఏర్పడి..
దొంగనోట్ల వ్యవహారం వెలుగులోకి రాగానే కామా రెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు, సిబ్బందితో కలిపి బృందాలను ఏర్పాటు చేశారు. రషీద్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు బిహార్‌కు వెళ్లాయి. అక్కడ మారుమూల ప్రాంతంలోని ఓ ఇంట్లో దొంగనోట్లు ముద్రించే సామగ్రిని, రషీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. వృత్తిరీత్యా రషీద్ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.
కలర్స్, కెమికల్ మిక్సింగ్‌లపై అవ గాహన ఉంది. దొంగనోట్లు తయారు చేసి అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో అతడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నందు లాల్ జంగ్‌డే, చట్టారాం, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సౌరవ్ డే, హరినారాయణ భగత్, పండిత్, యూపీకి చెందిన లక్కన్ కుమార్ దూబే, దివాకర్ చౌదరీ, సత్యదేవ్‌యాదవ్, మహారాష్ట్రకు చెందిన ప్రమోద్ కాట్రేలతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వారిలో కొందరు ఫేస్ బుక్‌లో గ్రూపులను ఏర్పా టు చేసి ఫ్రెండ్‌రిక్వెస్ట్‌ల ద్వారా జనాన్ని పోగు చేస్తారు.
వారి నుంచి ఆర్డర్‌లు తీసుకుంటారు. మరి కొందరు రషీద్ నుంచి దొంగనోట్లు తెప్పించి కొరియర్ల ద్వారా కస్టమర్లకు పంపిస్తారని రషీద్‌ను విచారించగా తేలింది. అక్కడి నుంచి పోలీసులు బృందాలుగా ఏర్పడి యూపీ, బెంగాల్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి లక్కన్ కుమార్ దూబే, దివాకర్ చౌదరి, సత్యదేవ్‌యాదవ్‌లను అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. అంతేగాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన 23 మంది ఆన్‌లైన్ ద్వారా దొంగనోట్లు తెప్పించుకునేందుకు ఆర్డర్‌లు పెట్టి సిద్ధంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
వారిలో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి రూ. 3 కోట్ల నకిలీ నోట్లకు ఆర్డర్ పెట్టుకున్నాడని తెలిసింది. ప్రధాన నిందితుడు రషీద్ ఇంటి నుంచి రూ.3.08 లక్షల నకిలీ నోట్లు, రూ.15,300 అసలు నోట్లు, రూ.8,830 సగం ముద్రించిన నకిలీ నోట్లు, ప్రింటర్లు, కంప్యూటర్లు, కలర్లు, పేపర్లు ఇతర వస్తువులన్నింటిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.