
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
గాంధారిలో వెలుగు చూసిన హత్య కేసును ఛేదించిన పోలీసులు
మృతుడు, నిందితులు మేడ్చల్ జిల్లా కీసరవాసులు
వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిందో భార్య. గాంధారి మండల కేంద్రానికి సమీపంలో వారం రోజుల క్రితం వెలుగు చూసిన హత్య కేసును పోలీసులు చేధించారు. మృతుడు, నిందితులను మేడ్చల్ జిల్లా కీసర వాసులుగా గుర్తించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. ఈ నెల 16 న గాంధారి శివారు లోని చద్మల్ వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఉన్న ఓ కాలువలో మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు.
గుర్తు తెలియని వ్యక్తిని ఎవరో హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. హత్య జరిగగిన సమయంలో అటుగా వెళ్తున్న ఓ యువకుడు మృతదేహం పక్కన మరో వ్యక్తి ఉన్నట్లు గమనించాడు. అతడు ఇచ్చిన ఆనవాళ్లు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను మేడ్చల్ జిల్లా కీసర మండలం భవానీ నగర్‌కు చెందిన ఏలూరి ఆంజనేయులు, ఇరగడింట్ల నవనీతలుగా గుర్తించారు. వారిని బుదవారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.
మేన బావతో 2012లో వివాహం..
కీసర ప్రాంతానికి చెందిన నవనీత కు మేన బావ నరేష్‌తో 2012 లో వివాహం జరిగింది. వారిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. కొంత కాలం క్రితం వారిద్దరూ ఆంజనేయులు వద్దకు కూలీ పనులకు వెళ్లారు. అక్కడ ఆంజనేయులుకు, నవనీతకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ముగ్గురూ కలిసి ఏడాది క్రితం పెద్దగుట్టకు దైవదర్శనానికి వచ్చి వెళ్లారు. కొద్ది రోజులుగా ఆంజనేయులు, నవనీతల వ్యవహారంపై అనుమానం వచ్చిన నరేష్ ప్రశ్నించడం, నవనీతను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. 15 న మరోసారి దైవదర్శనం కోసం అని చెప్పి నవీన్‌ను ఒప్పించి ముగ్గురూ కలిసి బైక్‌పై పెద్దగుట్ట వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో గాంధారి సమీపంలో ఆగి మద్యం సేవించారు. నరేష్‌కు అతిగా మద్యం తాగించి కాలువలో పడేశారు. ఆపై తీవ్రంగా కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో సమీపంలోని పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెచ్చి కాల్చివేశారని ఎస్పీ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నామని అన్నారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ సంతోష్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది సంజయ్, రవికుమార్, సాయిబాబా, ప్రసాద్, బంతీలాల్ లను అభినందించారు.