
ఆస్తి కోసం దారుణం
తల్లిని చంపి.. కూతురు, అల్లుడు కటకటాల్లోకి
మీనాజీపేటలో ఉదంతం..
దిక్కుతోచని స్థితిలో కుటుంబం
వర్గల్(గజ్వేల్): ఆస్తుల ఆశలో బంధాలు బలహీనమవుతున్నాయి. మానవత్వం మంట కలుస్తున్నది. ఆత్మీయ అనురాగాలు మసకబారుతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన సంతానమే కాలయములవుతున్నారు. వర్గల్ మండలం మీనాజీపేట హత్యోదంతం ఘటన తల్లీకూతుళ్ల అనుబంధానికి మచ్చగా మారింది. ఆస్తి కోసం ఓ కూతురు తల్లినే కడతేర్చిన తీరు నివ్వెరపరుస్తున్నది. నీడనిస్తున్న చెట్టునే నరికినట్లు, కుటుంబానికి అండగా నిలిచిన తల్లిని హతమార్చి, భర్తతో సహా ఆ కూతురు కటకటాల పాలైంది. అమాయకులైన ఆమె పిల్లలను, తండ్రిని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది.
పచ్చని సంసారం.. కకావికలం
వర్గల్ మండలం మీనాజీపేటకు చెందిన మంకని బాల్‌నర్సయ్య, బాలమణి(55) దంపతులకు కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉంది. కుమారుడు గిరి చేతికందే తరుణంలో మృతిచెందాడు. కాగా పెద్దకూతురు లావణ్యకు తునికి బొల్లారం భిక్షపతితో పెళ్లి చేశారు. తమకు మగదిక్కు లేకపోవడంతో చిన్నకూతురు నవనీత, మధు దంపతులు, వారి ముగ్గురు పిల్లలతో సహా ఇక్కడే ఉంటున్నారు. పొలం పనులను తండ్రి చూసుకుంటుండగా, తల్లి బాలమణి దినసరి కూలీగా ఆ కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నది. ఈ క్రమంలో ఆస్తిలో కొంత భూమి పెద్ద కూతురు లావణ్యకు ఇవ్వాలనే తల్లిదండ్రుల ఆలోచన పచ్చని కాపురంలో చిచ్చుగా మార్చింది.
మృత్యురూపమెత్తిన చిన్న కూతురు
అన్నీ తానై తల్లిదండ్రులను చూసుకుంటుంటే, ఆస్తిలో కొంత భూమిని అక్కకు ఎలా ఇస్తారంటూ చిన్న కూతురు నవనీత గొడవపడింది. ఈ క్రమంలో అసలు అమ్మనే లేకుండా చేస్తే ఆస్తి తనకే మిగులుతుందని పథకం రచించింది. తన భర్త మధు, తూప్రాన్ మండలం యావాపూర్‌కు చెందిన వరుసకు సోదరుడైన రామని గౌరయ్యతో కలిసి ఈ నెల 10న ఇంట్లోనే తల్లిని ఊపిరాడకుండా చేసి హత్యచేసింది. మృతదేహాన్ని తునికి బొల్లారం అయ్యప్ప చెరువులో పడేసి వెళ్లిపోయారు. తరువాత అమ్మ కనపడటం లేదంటూ నాటకానికి తెరలేపింది. ఈ క్రమంలో బాలమణి మృతదేహం లభ్యమవడంతో గుట్టురట్టయింది. కూతురే ఆస్తి కోసం భర్త, మరొకరితో కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని తెలిసింది. చివరకు భర్తతో సహా కటకటాలపాలైంది.
పసిపిల్లలతో.. బాల్‌నర్సయ్య
కూతురు, అల్లుడు కలిసి చేసిన దారుణానికి తన భార్య బాలమణి కానరాని తీరాలకు చేరడంతో బాల్‌నర్సయ్య తల్లడిల్లిపోతున్నాడు. పట్టుమని ఏడేండ్ల వయసు కూడా లేని మహనీత(7), రాంచరణ్(4)ల తల్లిదండ్రులు కటకటాల పాలవడంతో, అమ్మమ్మకు ఏమైందో, తల్లిదండ్రులకు ఏమి జరిగిందో తెలియని అమాయకత్వంలో తాత పంచన ఒంటరిగా మిగిలిపోయారు. ఆస్తి కోసం కన్నతల్లిని హత్య చేసి నా కూతురు పుట్టెడు దుఃఖం మిగిలి్చందని బాల్‌నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. పాలు తాగే ప్రాయంలో ఉన్న యేడాదిన్నర చిన్న కొడుకును తల్లి వెంటే పంపించారు.