
పాడె మోయడానికి వెనకడుగు
అయినవారూ దూరంగానే..
ఏదో కారణం చెప్పి తప్పించుకుంటున్న వైనం
పుట్టెడు బలగం ఉన్నా అంతిమయాత్రకు తప్పని తిప్పలు
ఒకప్పుడు మృతదేహాన్ని మోయడాన్ని పుణ్యంగా భావించేవారు. ఎవరైనా చనిపోయినపుడు బంధుమిత్రులే కాదు.. ముఖ పరిచయం ఉన్నవారు సైతం అంత్యక్రియల్లో పాల్గొనేవారు. కాసేపైనా పాడెను మోసేవారు. కనీసం ఓ చేయితో పాడెను పట్టుకుని నాలుగడుగులన్నా వేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అంత్యక్రియల్లో పాల్గొనడానికి చాలామంది ఇష్టపడడం లేదు. శవాన్ని మోయడానికి దగ్గరి బంధువులూ ముందుకు రావడం లేదు. దీంతో ‘ఆ నలుగురి’ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పెరిగిన సాంకేతికతతో ఓవైపు ప్రపంచమే కుగ్రామంగా మారిపోగా.. మరోవైపు మనుషుల మధ్య మాత్రం దూరం పెరిగిపోతోంది. గతంలో ఎవరో తెలిసిన వారు చనిపోతేనే తల్లడిల్లిపోయిన గుండెలు.. ఇప్పుడు దగ్గరి వారు దూరమైతే కనీసం అంత్యక్రియల్లో పాల్గొనడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. మనుషుల్లో పెరిగిన స్వార్థం కావచ్చు, మూఢ విశ్వాసాలు కావచ్చు.. చా వు దగ్గరకు వచ్చేసరికి దగ్గరి వాళ్లు సైతం దూరంగా ఉంటున్నారు. ఎంత బలగం ఉన్నా, ఎంతమంది ఆ త్మీయులు ఉన్నా అంత్యక్రియలకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోతోంది. వచ్చిన వారు కూడా దూరం నుంచే చూసి వెళుతున్నారు. ఏదో కొద్దిమంది మా త్రమే అంత్యక్రియలు అయ్యేదాకా ఆగుతున్నారు. వారు కూడా దూరంగా ఉండి అంత్యక్రియలు ఎప్పుడు పూర్తవుతాయోనని ఎదురు చూస్తున్నారు.
పెరిగిన మూఢత్వం
ఇప్పుడు మనుషుల్లో తెలియని మూఢత్వం పెరిగిపోయింది. చాలామంది శవం దగ్గరకే రావడం లేదు. దూరం నుంచి కుటుంబ సభ్యులకు ముఖం చూపించి వెళుతున్నారు. మరికొందరు వచ్చామా, వెళ్లామా అన్నట్టుగా ఉంటున్నారు. పాడె మోసేందుకు నలుగురు వ్యక్తులు కరువవుతుండడంతో ప్రతిచోటా శవాలను తీసుకువెళ్లేందుకు వైకుంఠరథాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇంటి దగ్గరి నుంచి వైకుంఠరథం దగ్గర దాకై నా మోయాల్సిందే కదా.. అలాగే దింపుడుగల్లం నుంచి వైకుంఠధామం వరకు మోసుకు వెళ్లాల్సిందే కదా.. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నలుగురి అవసరం ఎంతో ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో శవం మోయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కొన్ని సందర్భాల్లో నలుగురు జమయ్యే దాకా ఎదురు చూడాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి.
పట్టణాలు, నగరాల్లో మరీ దయనీయం..
గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు చనిపోయినా అంత్యక్రియలకు కొంతమందయినా హాజరవుతున్నారు. శవాన్ని మోయడానికి ఇబ్బందులు ఎదురవడం లేదు. అయితే పట్టణాలు, నగరాల్లో అయితే దయనీయమైన పరిస్థితి ఉంటోంది. ఎవరైనా చనిపోతే ఇంటి చుట్టుపక్కల వారు కూడా పట్టించుకోవడం లేదు. బంధువులు వచ్చేదాకా ఇంటి దగ్గర నలుగురు జమ కావడం లేదు. ఏర్పాట్లు చేయాలని ఎవరూ ముందుకు రావడం లేదు. బంధువులు, స్నేహితులు వచ్చినా, ఎంతమంది ఉన్నా కొన్నిసార్లు ఇంట్లో నుంచి శవాన్ని పాడైపె పడుకోబెట్టడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు.
ఇంటికొకరు నిబంధన..
అంత్యక్రియల సమయంలో ఎవరూ ఉండకపోవడంతో కొన్ని కుల సంఘాలు కట్టుబాట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కొన్ని కాలనీలలో కుల సంఘాలు ఎక్కువగా చావుల కోసమే నిలబడుతున్నాయి. సంఘంలో సభ్యులుగా ఉన్న వారి కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ప్రతి సభ్యుడు తప్పనిసరిగా హాజరుకావాలన్న నిబంధనలు పెడుతున్నారు. చనిపోయిన వ్యక్తి ఇంటి దగ్గర, అంత్యక్రియలకు వెళుతుండగా మార్గమధ్యలో, అలాగే వైకుంఠధామం వద్ద.. ఇలా మూడు, నాలుగుసార్లు హాజరు తీసుకుంటున్నారు. అయితే శవాన్ని మోయాలన్న నిబంధన పెడితే రావడం కూడా తగ్గిపోతుందని ఆ ఒక్కటి మినహాయించినట్టు ఓ కుల సంఘం పెద్దమనిషి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
విచిత్రమైన కానణాలతో..
దగ్గరి బంధువులు చనిపోయినా సరే కొందరు పాడె మోయడానికి ఏవో కారణాలు చెబుతున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఒక పెద్దాయన చనిపోగా దగ్గరి బంధువు ఒకరు దూరాన నిల్చుని చూస్తున్నాడు. పిలిచినా దగ్గరికి రాకపోవడంతో ఒకాయన అతడి వద్దకు వెళ్లి ‘మీ దగ్గరి వాళ్లు కదా.. శవం మోయడానికి ఎవరూ లేరు. నాలుగు అడుగులు మోయరాదే’ అని బతిమాలాడు. ‘నేను మొన్ననే ఇంటి నిర్మాణానికి గడప ఎక్కించిన. చావుకే వెళ్లొద్దని అందరు అంటున్నా ఇక్కడిదాకా వచ్చిన. శవం మోయద్దటా’ అని సమాధానం చెప్పి మెల్లిగా జారుకున్నాడు.
మరో సంఘటనలో ఓ వ్యక్తి శవాన్ని మోయడానికి రావాలని అందరూ పిలుస్తుంటే ‘మొన్ననే నా బిడ్డ పెళ్లి అయ్యింది. కాళ్లు కడిగిన. శవం మోయద్దని అంటున్నరు. అందుకే దూరంగా ఉన్న’ అని మరణించినతని వంశానికి చెందిన వ్యక్తి సమాధానమిచ్చాడు.
ఇంకోచోట ఓ వ్యక్తి చనిపోయాడు. రోజూ కలిసి తిరిగిన దోస్తు మాత్రం మృతదేహం దగ్గరికి వచ్చి దూరంగా నిల్చున్నాడు. దోస్తు అమ్మా, నాన్నను ఓదార్చడానికి కూడా వెళ్లలేదు. ఇద్దరు రోజూ కలిసి తిరిగేవారు కదా.. ఎందుకు రావడం లేదు అని అడగ్గా.. ‘నా భార్య గర్భవతి. ఇప్పుడు శవం దగ్గరకు పోవద్దంట. శవాన్ని మోయద్దంట. అందుకే దూరంగా ఉన్న’ అని చెప్పాడు.
కొన్నాళ్ల క్రితం జిల్లాలో ఒకాయన చనిపోతే దగ్గరి బంధువులకు సమాచారం ఇచ్చారు. ఒకాయన రాకపోవడంతో ఆయనకోసం ఎదురుచూడసాగారు. ఫోన్లు చేస్తే సమాధానం ఇవ్వడం లేదు. చివరికి తేలింది ఏమంటే సదరు వ్యక్తి ఇంటి నిర్మాణం పూర్తయ్యింది. మరో వారంలో గృహ ప్రవేశం ఉంది. అందుకే ఆయన అంత్యక్రియలకు రాలేదు. ఇలా ఏదో ఒక సాకుతో దగ్గరివారి అంత్యక్రియల్లోనూ చాలామంది పాల్గొనడం లేదు. చివరి చూపు కోసం వచ్చినా పాడె మోయడానికి ముందుకు రావడం లేదు.