
యూరియా కోసం గంటలతరబడి ఎదురుచూస్తున్న రైతులు
టోకెన్ల కోసం మహిళా రైతుల తోపులాట..ఒకరికి గాయాలు
మఠంపల్లిలో పీఏసీఎస్ డైరెక్టర్‌ల రాజీనామా..
రైతుల కోసం యూరియా లారీ నడిపిన కానిస్టేబుల్
ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతామంటూ ఏఈఓలు బెదిరించారన్న రైతులు
కామారెడ్డి టౌన్ /కామేపల్లి/అర్వపల్లి/దేవరకద్ర /మఠంపల్లి/కేసముద్రం/ఖానాపురం: యూరియా కోసం రైతుల ఆందోళనలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. టోకెన్ల కోసం, యూరియా లారీల కోసం ఎదురుచూపులు నిత్యకృత్యం అయ్యాయి.
» కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్‌లోని పంపిణీ కేంద్రం వద్ద యూరియా కోసం క్యూ లైన్‌లో నిలుచున్న రైతులు ఒక్కసారిగా సిరిసిల్ల రోడ్‌లో రోడ్డుపై ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి, సీఎంకు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
» ఖమ్మం జిల్లా కామేపల్లి రైతు వేదికలో కూపన్లు ఇస్తున్నారని తెలిసి రైతులు వెళ్లారు. వారంరోజులుగా తిరుగుతుంటే ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నించగా జాస్తిపల్లి ఏఈఓ రవికుమార్, కామేపల్లి ఏఈఓ శ్రీకన్య తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని రైతులు వాపోయారు. అంతేకాక ఇది తమ ఆఫీస్ అని ఎక్కువ మాట్లాడితే కేసు పెడతామని బెదిరించారన్నారు.
» సూర్యాపేట జిల్లా అర్వపల్లి పీఏసీఎస్ వద్ద రైతులు యూరియా కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. చెప్పులు క్యూలైన్‌లో పెట్టి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాశారు. యూరియా రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు పీఏసీఎస్ ఎదుట హైవేపై రాస్తారోకో నిర్వహించారు.
» మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర పీఏసీఎస్ కేంద్రం వద్ద టోకెన్లు ఉన్న రైతులకు యూరియా పంపిణీ చేస్తుండగా, టోకెన్లు లేని రైతులు పెద్ద ఎత్తున అక్కడకు చేరడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఒక్కసారిగా రైతులు ఎగబడ్డారు. మహిళా రైతుల అరుపులు, కేకలతో తోసుకున్నారు. ఈ తరుణంలో నార్లోనికుంట్ల సత్యమ్మ, డోకూర్ బాలకిష్టమ్మ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సత్యమ్మ చెవికి తీవ్ర గాయమైంది.
» సూర్యాపేట జిల్లా మఠంపల్లి పీఏసీఎస్‌కు చెందిన నలుగురు డైరెక్టర్లు యూరియా కొరతకు నిరసనగా రాజీనామా చేశారు. తమ గ్రామాల్లోని రైతులకు యూరియా అందజేయలేకపోతున్నామన్న మనస్తాపంతో రాజీనామా చేస్తున్నట్లు డైరెక్టర్లు గోలి చంద్రం, పట్టేటి ఆంథోని, వల్లపుదాస్ చినలింగయ్యగౌడ్, పశ్యా రామనరసమ్మ చెప్పారు.
» మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి, కల్వల గ్రామాల్లో సొసైటీ పాయింట్ వద్ద రైతులు గురువారం తెల్లవారుజామునే క్యూలో నిల్చున్నారు. ఉదయం 7 గంటలకే యూరియా లోడ్ లారీ రావాల్సి ఉండగా 11 గంటలైనా రాలేదు. కేసముద్రం విలేజ్ దర్గా వద్ద ఆ డ్రైవర్ యూరియా లోడ్ లారీ తీసుకొచ్చి నిలిపాడని పోలీసులు తెలుసుకున్నారు.
దర్గా నుంచి ఉప్పరపల్లి వరకు లారీని తీసుకెళ్లి 220 బస్తాలను సెంటర్‌లో దింపించారు. ఆ తర్వాత కల్వల సెంటర్‌కు లారీని తీసుకెళ్లాల్సి ఉండగా, అప్పటికే లారీడ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ ఎండీ అలీమ్ ఆ లారీని తానే డ్రైవింగ్ చేసి కల్వలకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత 220 బస్తాలను రైతులకు పంపిణీ చేశారు.
» వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని గొల్లగూడెంతండాకు చెందిన తేజావత్ శ్రీను ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. సరిపోను యూరియా లభించకపోవడంతో ఐదు ఎకరాల్లో మొక్కజొన్న పంటను వదిలేశాడు. దీంతో పంటను గురువారం గొర్రెల కాపరులకు అప్పగించడంతో అవి మేశాయి.
