రోడ్ల విస్తరణకు నిధులివ్వండి
● గడ్కరీని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్
కామారెడ్డి టౌన్: కామారెడ్డి నియోజకవర్గంలో రింగ్‌రోడ్డు, రోడ్ల విస్తరణ కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి నిధుల కోసం వినతిపత్రం అందజేశారు. జిల్లా కేంద్రం చుట్టూ 54 కిలో మీటర్ల పొడవైన ఔటర్ రింగ్‌రోడ్డు ఏర్పాటు చేయాలని గడ్కరీని కోరానని ఆయన తెలిపారు. లింగాపూర్ స్జేజీ నుంచి మెడికల్ కళాశాల, మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల మీదుగా టేక్రియాల్ జాతీయ రహదారి వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ కోసం రూ. 40 కోట్లు ఇవ్వాలని కోరానన్నారు. భిక్కనూరు నుంచి తిప్పాపూర్, తలమడ్ల మీదుగా రాజంపేట వరకు డబుల్ రోడ్డు కోసం రూ. 18 కోట్లు, కామారెడ్డి పాత బస్టాండ్ నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ కోసం రూ. 8 కోట్లు, పాల్వంచ మర్రి నుంచి మాందాపూర్ మీదుగా భిక్కనూరు వరకు డబుల్ రోడ్డు విస్తరణకు రూ. 24 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు.
కామారెడ్డి అర్బన్: జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం ఈనెల 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని డీఈవో రాజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరికోసం 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్‌కార్డు లేదా రేషన్‌కార్డుతో గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఏవైనా సందేహాలుంటే 97019 07749 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెద విత్తన్తోత్పత్తి క్షేత్రంలో చెడిపోయిన మోటారుకు మరమ్మతులతోపాటు నూతన బోర్ల తవ్వకానికి నిధుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి తెలిపారు. మాల్తుమ్మెద విత్తన క్షేత్రంలో నెలకొన్న సాగునీటి ఇబ్బందులపై ‘సాక్షి’ దినపత్రికలో గురువారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా వ్యవసాయ అధికారి స్పందించారు. ప్రభుత్వంనుంచి నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
కామారెడ్డి క్రైం: మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల విధులకు రిపోర్ట్ చేయని 53 మందిపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. పీవోలు, ఏపీవోలుగా విధులు కేటాయించిన ప్రదేశాల్లో రిపోర్ట్ చేయనందుకు వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం తొలి విడత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలగా.. శుక్రవారంతో రెండో విడత ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడుతుంది. ఆ తర్వాత సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుంది.
గాంధారి, లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, మహ్మద్‌నగర్, నిజాంసాగర్, పిట్లం మండలాలలో రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మండలాల పరిధిలో 197 పంచాయతీలకుగాను 43 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 1,654 వార్డులకుగాను 778 వార్డుల సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన స్థానాలలో పోటీ ఉంది. అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తు న్నారు. పోలింగ్‌కు సమయం తక్కువగా ఉండడంతో గెలుపు కోసం అభ్యర్థులు చమటోడుస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లభ్యర్థిస్తూనే కుల సంఘాలు, మహిళా సంఘాలను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది.


