చలిలోనూ ఓటెత్తారు
ప్రతి రెండు గంటలకు పోలింగ్..
● తొలి విడత పోలింగ్ ప్రశాంతం
● ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు
● 79.40 శాతం పోలింగ్ నమోదు
● కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
కామారెడ్డి డివిజన్ పరిధిలోని బీబీపేట, భిక్కనూరు, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల పరిధిలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 167 పంచాయతీలు ఉండగా.. 11 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 156 గ్రామాల సర్పంచ్ పదవులకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. అలాగే 1,520 వార్డులకుగాను 433 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మూడు చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 1,084 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2,42,913 మంది ఓటర్లుండగా 1,92,870 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 79.40 గా నమోదయ్యింది. ఆయా మండలాల్లో పోలింగ్‌ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్లు మధుమోహన్, విక్టర్ తదితరులు పరిశీలించారు.
చలిని లెక్క చేయకుండా..
జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఓటేసేందుకు ఓటర్లు ఉదయమే తరలివచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. బీబీపేట మినహా అన్ని మండలాల్లో ఉదయం 9 గంటల వరకు దాదాపు 20 శాతం పోలింగ్ రికార్డయ్యింది. 11 గంటల వరకు అన్నిచోట్ల 50 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఓటేసేందుకు మహిళల ఆసక్తి...
ఓటు వేయడానికి ఎప్పటిలాగే మహిళలు ఆసక్తి చూపారు. పది మండలాల్లో 1,27,375 మంది మహిళలు ఉండగా 1,04,228 మంది ఓటేశారు. 81.83 శాతం మహిళలు ఓటేసినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే పురుషులు 1,15,535 మంది ఉండగా 88,642 మంది ఓటు వేశారు. ఓటింగ్ శాతం 76.72 గా ఉంది. సరాసరిన మొత్తం 79.40 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు.
మండలం 9 గంటలు 11 గంటలు 1 గంట
భిక్కనూరు 21.11 52.78 81.05
బీబీపేట 7.36 49.09 83.65
దోమకొండ 19.14 51.19 76.82
కామారెడ్డి 23.68 56.45 78.45
మాచారెడ్డి 19.46 52.46 78.19
పాల్వంచ 20.49 55.89 81.09
రాజంపేట 21.02 58.02 80.05
రామారెడ్డి 22.61 50.84 75.26
సదాశివనగర్ 20.96 56.42 78.81
తాడ్వాయి 18.76 52.59 80.63
సరాసరి 19.70 53.31 79.40


