
అంత్యక్రియలు పూర్తయ్యేదాకా అందరూ ఉండాల్సిందే
ఎర్రాపహాడ్‌లో తరతరాలుగా వస్తున్న సంప్రదాయం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆ ఊరిలో ఎవరైనా చనిపోతే శవ దహనానికి అవసరమైన కట్టెలను ఇంటికి ఒకటి చొప్పున సేకరిస్తారు. అంత్యక్రియలు పూర్తయ్యేదాకా ఇంటికొకరైనా ఉంటారు. ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ మృతుల కుటుంబాలకు మేమున్నామన్న భరోసా ఇస్తున్నారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎర్రాపహాడ్ గ్రామానికి చెందిన రెడ్డి కులస్తులు.
ఎర్రాపహాడ్ గ్రామంలో రెడ్డి కులస్తులతోపాటు ఒకటి రెండు కులాల వారు మాత్రమే మృతదేహాలను దహనం చేస్తారు. మిగతా కులాల వారు ఖననం చేస్తారు. ఈ గ్రామంలో 201 రెడ్డి కుటుంబాలున్నాయి. ఇక్కడ ఎవరు చనిపోయినా దహన సంస్కారాలు చేయడానికి ఇంటికో కర్ర (కట్టె) జమ చేస్తారు. తాతల కాలం నుంచీ వస్తున్న ఈ ఆనవాయితీ.. ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. కులస్తులు ఎవరు చనిపోయినా వెంటనే ఎవరో ఒకరు ట్రాక్టర్‌ను రెడ్డి కుటుంబాలు నివసించే కూడలి వద్దకు తీసుకెళతారు.
పశువుల కొట్టాల దగ్గరనో, ఇంటి పెరడులోనో ఉంచిన కట్టెల నుంచి తలా ఒక కట్టెను పట్టుకొని వచ్చి ట్రాక్టర్‌లో వేస్తారు. ట్రాక్టర్ నిండగానే తీసుకెళ్లి శ్మశానవాటికలో కాడు పేరుస్తారు. అంత్యక్రియలు పూర్తయ్యేదాకా అందరూ ఉంటారు. అందుబాటులో లేకపోతే, అనారోగ్యంతో బాధపడుతుంటే, ఇత ర ఇబ్బందులు ఏమైనా ఉంటే మినహాయింపు ఉంటుంది.
అలా కుల కట్టుబాటు చేసుకున్నారు. మొత్తం కార్యక్రమం పూర్తయిన తర్వాతే ఎవరి ఇళ్లకు వారు వెళతారు. అమెరికాలో ఉంటున్న అదే గ్రామానికి చెందిన ఏనుగు ప్రభాకర్‌రెడ్డి తన తండ్రి లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం వైకుంఠ రథాన్ని అందించా రు. ఎవరు చనిపోయినా మృతదేహాన్ని వైకుంఠ రథం ద్వారా శ్మశాన వాటికకు తీసుకెళతారు. అయితే శవయాత్ర జరుగుతున్నపుడు అందరూ శవం వెనకాలే నడవాలని పెద్దమనుషులు చెప్పడంతో అది కూడా పాటిస్తున్నారు.