మీరు తినే పనీర్‌.. సహజమైనదేనా? | FSSAI regulations for hotels now | Sakshi
Sakshi News home page

మీరు తినే పనీర్‌.. సహజమైనదేనా?

May 4 2025 12:18 AM | Updated on May 4 2025 12:18 AM

FSSAI regulations for hotels now

హోటళ్లలో పెరిగిన ప్రత్యామ్నాయ పనీర్‌ వాడకం 

దీనివల్లఆరోగ్యంపై దుష్ప్రభావాలు 

మెనూలో పనీర్‌ వివరాలు పెట్టాల్సిందే 

హోటళ్లకు ఇకపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలు 

పనీర్‌... శాకాహారుల హై ప్రొటీన్‌ఫుడ్‌!  పాలక్‌ పనీర్‌.. పనీర్‌ టిక్కా.. పనీర్‌ 65.. చిల్లీ పనీర్‌.. పనీర్‌ బటర్‌ మసాలా..  ఇలా రకరకాల వెరైటీలతో రెస్టారెంట్లలో చవులూరిస్తూ ఉంటుంది పనీర్‌!  చాలామంది బయట షాపుల్లో దొరికే పనీర్‌ తెచ్చుకుని ఇంట్లోనూ ఎన్నో రకాల వెరైటీలు ట్రై చేస్తుంటారు. 

మీకు తెలుసా.. లీటరు తాజా పాల (గేదె) నుంచిఎంత పనీర్‌ తయారుచేయవచ్చో? గరిష్ఠంగా 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు, అంతే! మరి ఇన్ని వందల వేల రెస్టారెంట్లు, సూపర్‌ మార్కెట్లలోఅంతంత పనీర్‌ ఎలా దొరుకుతోంది?  అది ఆర్గానిక్‌ పనీర్‌ అంటేతాజా పాలతో తయారైనది కాదన్నట్టే కదా!   అన్నట్టే ఏంటీ.. ఉన్న మాటే!  - (సాక్షి, స్పెషల్‌ డెస్క్) 

మనందరికీ పాల ఉత్పత్తులైన పెరుగు, పనీర్‌ తెలుసు. కానీ, ప్రత్యామ్నాయ డైరీ ఉత్పత్తుల గురించి మీరు విన్నారా? ఇవి పాలతో కాకుండా సింథటిక్‌ పదార్థాలతో తయారవుతాయి. అనేక హోటళ్లూ, సూపర్‌ మార్కెట్లలో వీటి తాకిడి ఇప్పుడు ఎక్కువైపోయింది. అందుకే, పనీర్‌ సహా ప్రత్యామ్నాయ డైరీ ఉత్పత్తులు అన్నిటి అమ్మకాల మీద ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కొన్ని నిబంధనలను విధించనుంది.  

ఇది సహజ పనీర్‌...
సాధారణంగా పనీర్‌ను.. పాలను కాచి అందులో నిమ్మరసమో లేదా వెనిగరో లేదా సిట్రిక్‌ ఆసిడో వేసి విరగ్గొడతారు. అలా వచి్చన దాన్ని ఒక గుడ్డలో వేసి.. అందులోని నీరంతా పోయేవరకు వడకడతారు. తర్వాత దాన్ని చల్లటి నీటిలో ఓ రెండు మూడు గంటల పాటు వేసి ఉంచుతారు.దాంతో అది మృదువుగా తయారువుతుంది. ఇది పాల నుంచి పనీరు తయారయ్యే ప్రక్రియ.  

వినియోగదారుడికి తెలియాల్సిందే 
ఇటీవల ప్రత్యామ్నాయ పనీర్‌ అమ్మకాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇక నుంచి ప్రతి రెస్టారెంట్‌.. తమ దగ్గరున్న పనీర్‌ ఎలాంటిదో మెనూలో స్పష్టంగా తెలియజేయాలనే నిబంధన పెట్టబోతోంది. తాను ఎలాంటి పనీర్‌ను ఆర్డర్‌ చేస్తున్నాడో వినియోగదారుడికి కచ్చితంగా తెలియాలని.. ఆ చాయిస్‌ వాళ్లకుండాలని చెబుతోంది.అంతేకాదు అమ్మకందారులు కూడా ఈ కృత్రిమ డెయిరీ ఉత్పత్తుల మీద.. పాల ఉత్పత్తుల కేటగరీలో ఈ కృత్రిమ లేదా ప్రత్యామ్నాయ పాల ఉత్పత్తులను పరిగణించరాదని స్పష్టం చేయనుంది. 

అంతేకాదు, వాటి మీద డెయిరీ ప్రోడక్ట్స్‌ అనే లేబుల్‌ వేయకూడదనే కఠిన నిబంధనను కూడా అమలుచేయనుంది. నిజానికి ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ 2011 నిబంధనల ప్రకారం.. ఈ కృత్రిమ పాల ఉత్పత్తులను డెయిరీ ప్రోడక్ట్స్‌గా, మిశ్రమ పాల ఉత్పత్తులుగా పరిగణించరు. అందుకే వీటి మీద పాల ఉత్పత్తులు అని లేబుల్‌ వేయకూడదు. 

కృత్రిమ పాల ఉత్పత్తుల మీద ‘పాల ఉత్పత్తులు’అని లేబుల్‌ అతికించడం.. కొనుకోలుదారులను తప్పుదోవ పట్టించడమే కాదు, ఒకరకంగా మోసం చేయడం కూడా అని చెబుతున్నారు నిపుణులు. దీనికి సంబంధించి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ త్వరలోనే కొన్ని మార్గదర్శకాలను వెలువరించనుంది.  

ప్రత్యామ్నాయ పనీర్‌ ఇలా..
ఈ ప్రత్యామ్నాయ పనీర్‌ను పామాయిల్‌లాంటి వెజిటబుల్‌ ఆయిల్స్, స్టార్చ్‌లు లాంటి వాటితో తయారుచేస్తారు. ఇది చూడటానికి అచ్చంగా సహజమైన పనీర్‌ లాగే కనపడుతుంది. కానీ రుచిలో కొంత తేడా ఉంటుంది. కృత్రిమంగా తయారైన ఈ పనీర్‌ ఆరోగ్యం మీద దు్రష్పభావాలను చూపిస్తుంది. హోటళ్లలో ఇలాంటి ప్రత్యామ్నాయ పనీర్‌నే వండి వడ్డిస్తున్నారని.. ఇటీవల చాలా పేరున్న హోటళ్లలో జరిగిన ఫుడ్‌ సేఫ్టీ ఇన్‌స్పెక్షన్‌ రైడ్స్‌లో తేలింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి.  

ఇలా ఫిర్యాదు చేయవచ్చు 
ఒకవేళ ఎవరైనా కృత్రిమ పాల ఉత్పత్తులను సహజమైనవిగా లేబుల్‌ వేసి అమ్మడం కొనుగోలుదారుల దృష్టికి వస్తే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ యాప్‌లో గానీ, వెబ్‌సైట్‌ ద్వారా గానీ ఫిర్యాదు చేయవచ్చని చెబుతున్నారు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సిబ్బంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇకనుంచి ప్రతి కొనుగోలుదారుడు సూపర్‌మార్కెట్లలో, డెయిరీ ఫామ్స్‌లో, రెస్టరెంట్లలో.. ఇలా ఎక్కడైనా తాము కొనబోయే / ఆర్డర్‌ చేయబోయే డెయిరీ ప్రోడక్ట్‌ సహజమైనదా లేదా కృత్రిమంగా తయారైనదా అనే వివరాలు చూసుకోవచ్చు. ఆ వివరాలు లేకపోతే అడిగి మరీ ఆ వివరాలను లేబుల్‌ మీద.. రెస్టరెంట్లలో అయితే మెనూలో పొందుపరచాలని డిమాండ్‌ చేయవచ్చు. ఒకవేళ వివరాలు ఉన్నా అవి అస్పష్టంగా ఉంటే ఫిర్యాదూ చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement