హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు బ్రేక్? | Hyderabad Metro Phase-2 Faces Delay As Centre Proposes New Evaluation Process, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు బ్రేక్?

Jun 23 2026 3:08 PM | Updated on Jun 23 2026 4:21 PM

Fresh Hurdles for Hyderabad Metro Expansion

సాక్షి,హైదరాబాద్‌: మెట్రో రైలు విస్తరణ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. మెట్రో రైల్ విస్తరణపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విధానానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. ఈ తాజా ఒప్పందం ప్రకారం.. ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం చేసే బాధ్యతను ఎస్‌బీఐ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయించాయి. అయితే, ఈ కొత్త పరిణామంతో గతంలో చర్చల్లో ఉన్న ఐఎఫ్‌ఆర్‌సీ రుణం (ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌)సీన్‌ నుంచి పూర్తిగా మాయమవ్వడం గమనార్హం.

కేంద్ర ప్రతిపాదనల ప్రకారం మెట్రో ఫేజ్-1కు సంబంధించి మళ్లీ కొత్తగా విలువ నిర్ధారణ (వాల్యుయేషన్) ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ వాల్యుయేషన్ పూర్తయిన తర్వాతే, ప్రాజెక్ట్ స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, తగిన ఆర్థిక సంస్థ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాతే మెట్రో ఫేజ్-2 విస్తరణ, దానికి అయ్యే నిర్మాణ వ్యయం,నిధుల సేకరణ అంశాలపై క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహిస్తారు.

ఈ ఎస్‌బీఐ కన్సల్టెన్సీ అధ్యయన ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రం నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారిని నియమించనున్నారు. వీరిద్దరూ సమన్వయం చేసుకుంటూ కన్సల్టెన్సీకి అవసరమైన వివరాలను అందిస్తారు. ఈ సంస్థ ఇచ్చే తుది నివేదిక ఆధారంగానే హైదరాబాద్ మెట్రో విస్తరణపై భవిష్యత్తు కార్యచరణను ఖరారు చేయనున్నారు. కేంద్రం తెచ్చిన ఈ కొత్త విధానం వల్ల మెట్రో విస్తరణ ప్రక్రియ మళ్లీ మొదటికి రావడమే కాకుండా, పనుల్లో మరింత ఆలస్యం జరిగేలా కనిపిస్తోంది.

ఈ ఎస్‌బీఐ కన్సల్టెన్సీ తన అధ్యయనాన్ని పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందనే గడువుపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టత లేదు. దీంతో మెట్రో ఫేజ్-2 విస్తరణ పనులు ఎప్పుడు పట్టాలెక్కుతాయనే దానిపై సందిగ్ధత నెలకొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement