
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట్ కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, గుడిసెలు వేయడంతో పాటు వ్యక్తిగత కారణాలే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. బిహార్ నుంచి తుపాకులు తెచ్చి సీపీఐ నేత చందునాయక్‌ను ప్రత్యర్థులు హత్య చేశారు. కాల్పులు జరిపిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారును సీజ్ చేసిన పోలీసులు.. నిందితులు వాడిన గన్స్, బుల్లెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజులుగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ శివారులో నిందితులను పట్టుకున్నారు.
ఈ నెల 15న హైదరాబాద్ మలక్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని శాలివాహననగర్ పార్కులో వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా చందు నాయక్ దుండగుల కాల్పుల్లో చనిపోయారు. కళ్లలో కారం చల్లిన నిందితులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఆయన శరీరంలోకి మూడు తూటాలు దూసుకుపోయాయి. మూడేళ్ల క్రితం ఎల్బీనగర్ ఠాణాలో నమోదైన హత్య కేసులో చందు నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీకారం, భూ వివాదాలతోపాటు వివాహేతర సంబంధం కోణాన్ని పరిగణనలోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నాగర్ కర్నూల్ జిల్లా నర్సాయిపల్లికి చెందిన చందు.. భార్య నారీబాయి, కుమారుడు సిద్ధు, కుమార్తె సింధులతో కలిసి దిల్‌సుఖ్‌నగర్ సమీపంలోని విద్యుత్‌నగర్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం సిద్ధు కెనడాలో ఎంటెక్ చదువుతుండగా.. సింధు గ్రూప్స్‌కు సన్నద్ధమవుతోంది. చందు విద్యార్థి దశలో ఎస్‌ఎఫ్‌ఐలో, కార్మిక నాయకుడిగా సీఐటీయూలో పని చేశారు. ఎల్బీనగర్ ఏరియా సీపీఎం నాయకుడిగా నాగోల్ శ్రీ సాయినగర్‌లోని స్థలాల్లో పేదలతో గుడిసెలు వేయించారు.
2010లో సీపీఐలో చేరి భూపోరాటం చేసి పట్టాలు ఇప్పించారు. సీపీఐ (ఎంఎల్) నాయకుడు రాజేష్‌తో కొన్నాళ్లుగా చందుకు విభేదాలున్నాయి. కుంట్లూర్ రావినారాయణరెడ్డి నగర్‌లోని మూడెకరాల భూమిలో గుడిసెలు వేసుకున్న వారి నుంచి రాజేష్ తదితరులు డబ్బులు వసూలు చేస్తుండటాన్ని చందు అడ్డుకున్నారు. దీంతో రాజేష్ , సుధాకర్, మున్నా, రాయుడుతో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి.