
ఆలిండియా కోటా కింద కేటాయించిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ
ఎంబీబీఎస్‌లో 26,308, బీడీఎస్‌లో 2,600, బీఎస్‌సీ నర్సింగ్‌లో 1,700 సీట్లు
ఇందులో తెలంగాణ విద్యార్థులకు ఎంబీబీఎస్‌లో 156, బీడీఎస్‌లో 5 సీట్లు
సాక్షి, హైదరాబాద్: నీట్ యూజీ–2025లో ఆలిండియా కోటా తొలి విడత కౌన్సెలింగ్‌లో వివిధ కోర్సుల్లో 30,608 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ మేరకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) వారికి సీట్లను కేటాయించింది. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం ఎంసీసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఎంబీబీఎస్‌కు సంబంధించి 26,308 మంది విద్యార్థులకు 337 కళాశాలల్లో సీట్లు కేటాయించారు. బీడీఎస్‌లో 2,600 మంది విద్యార్థులు 120 కళాశాలల్లో సీట్లు పొందారు.
బీఎస్‌సీ నర్సింగ్‌లో 1,700 మంది విద్యార్థులు 22 కళాశాలల్లో సీట్లు పొందారు. ఈ విద్యార్థులంతా ఈనెల 18లోగా సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈనెల మూడో వారం చివరలో రెండో రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది. స్థానికత అంశంపై సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ వాయిదా పడుతూ వస్తోంది.
తెలంగాణలో ఇలా...
ఆలిండియా కోటా కింద మొదటి విడతలో తెలంగాణకు చెందిన కళాశాలల్లో 306 సీట్లు భర్తీ అయ్యాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లోనే కావడం గమనార్హం. వీటిలో 161 సీట్లను తెలంగాణ విద్యార్థులు సాధించగా, మిగతా సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులు పొందారు. రాష్ట్రానికి చెందిన 156 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించగా, ఐదుగురు బీడీఎస్ కోర్సుల్లో సీట్లు పొందారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిమ్స్ హైదరాబాద్‌లో 17 సీట్లు, ఈఎస్ఐసీలో 9 సీట్లను తెలంగాణ విద్యార్థులు సాధించారు.
ఎంసీసీ జాబితా ప్రకారం, తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్‌లోని గాంధీలో 15, ఉస్మానియాలో 14 సీట్లు పొందారు. ఇతర ప్రభుత్వ వైద్య కళాశాలల విషయానికొస్తే.. తెలంగాణ విద్యార్థులు నిజామాబాద్‌లో 12, మహæబూబ్‌నగర్‌లో 11, సిద్దిపేటలో 14, సూర్యాపేటలో 13, కరీంనగర్‌లో 12, సంగారెడ్డిలో 11, జగిత్యాలలో 12, ఖమ్మంలో 13, మంచిర్యాలలో 11, ఆదిలాబాద్‌లో 10, వరంగల్‌లో 8, భూపాలపల్లిలో 6, వికారాబాద్‌లో 5, వనపర్తిలో 5, భద్రాద్రి కొత్తగూడెంలో 5, మెదక్, నారాయణపేట్, జనగామ 4 చొప్పున, గద్వాల, ములుగు, నాగర్‌కర్నూల్, సిరిసిల్ల, యాదాద్రిలో 3 చొప్పున, కామారెడ్డి, నిర్మల్, పెద్దపల్లి, భద్రాద్రిలో 2 చొప్పున, ఆసిఫాబాద్‌లో ఒక సీటు సాధించారు.
కాగా తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా ఏపీలో 12 మంది సీట్లు పొందారు. కర్ణాటకలో 9, తమిళనాడులో 7, మహారాష్ట్రలో 5, కేరళలో 4, ఢిల్లీలో 3, యూపీలో 3, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో 2 సీట్ల చొప్పున, రాజస్తాన్‌లో ఒకరు ఎంబీబీఎస్‌లో సీట్లు సాధించారు