
షెడ్యూల్ విడుదల చేసిన ఎంసీసీ
21 నుంచి 30 వరకు ఆలిండియా కోటా
30 నుంచి స్టేట్ కోటా సీట్లకు కౌన్సెలింగ్
రాష్ట్రంలో 9,065 ఎంబీబీఎస్ సీట్లు
34 ప్రభుత్వ కాలేజీల్లో 4,090 సీట్లు
సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లోప్రవేశం కోసం నీట్ యూజీ– 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆలిండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్రం పరిధిలోని సీట్లలో చేరికకు సంబంధించిన కౌన్సెలింగ్ తేదీలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది. ఆలిండియా కోటా, డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలకు మొదటి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 21 నుంచి 30వతేదీ వరకు జరుగు తుంది. మూడు రౌండ్లలో జరిగే ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 10వ తేదీ వరకు సాగనుంది.
స్టేట్ కౌన్సెలింగ్ మొ దటి దశను ఈ నెల 30 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18 వరకు మూడు రౌండ్లలో ఈ కౌన్సెలింగ్ సాగనుందని ఎంసీసీ తెలిపింది. సెపె్టంబర్ 1వ తేదీ నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించింది. తెలంగాణ నుంచి నీట్ యూజీ –2025 పరీక్ష 70,259 మంది రాయగా, 43,400 మంది కౌన్సెలింగ్‌కు అర్హత సాధించినట్లు ఇప్పటికే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.
రాష్ట్రంలో 9,065 ఎంబీబీఎస్ సీట్లు
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలతోపాటు డీమ్డ్ యూనివర్సిటీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కలిపి 64 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 34 రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలు కాగా , 26 ప్రైవేటు కాలేజీలు. మల్లారెడ్డి డ్రీమ్డ్ యూనివర్సిటీ పేరిట 2 కాలేజీలు ఉండగా, ఈఎస్‌ఐ, బీబీనగర్ ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. ఈ కళాశాలలన్నింటిలో కలిపి 9,065 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటిలో 34 ప్రభుత్వ కళాశాలల్లో 4,090 సీట్లు ఉండగా, వాటిలో 15 శాతం అంటే 613 సీట్లు ఆలిండియా కోటా కిందికి వెళ్తాయి. మిగతా 3,477 సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయి.
అలాగే 26 ప్రైవేట్ కళాశాలల్లో 4,350 సీట్లు ఉన్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన రెండు మెడికల్ కాలేజీలు (ఒకటి మహిళా కాలేజ్) డీమ్డ్ యూనివర్సిటీ కేటగిరీలో ఉన్నాయి. ఈ రెండు కళాశాలల్లో కలిపి 400 సీట్లు ఉండగా, డీమ్డ్ యూనివర్సిటీ విభాగంలో వీటికి కౌన్సెలింగ్ జరుగనుంది. కాగా ప్రైవేటు కాలేజీల్లోని 4,350 సీట్లలో 50 శాతం కనీ్వనర్ కోటా కింద తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయి. మరో 35 శాతం సీట్లు బీ – కేటగిరీలో, 15 శాతం సీట్లు సీ కేటగిరీలో ఎన్‌ఆర్‌ఐ కోటాలో ఫీజు లు చెల్లించే స్తోమత ఉన్నవారికే కేటాయిస్తారు. ఇవి కాకుండా ఈఎస్‌ఐ కాలేజీలో 125 సీట్లు, బీబీనగర్ ఎయిమ్స్‌లోని 100 సీట్లను ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు.