సెల్ఫీ వీడియో తీస్తూ రైతు ఆత్మహత్యాయత్నం 

Farmer Attempted Suicide While Taking Selfie Video In Medak District - Sakshi

పోడు భూమిని అధికారులు లాక్కుంటున్నారని మనస్తాపం 

మెదక్‌ జిల్లా దేవులపల్లిలో ఘటన

కౌడిపల్లి(నర్సాపూర్‌): సెల్ఫీ వీడియో తీస్తూ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువ రైతు. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. దేవులపల్లి గ్రామానికి చెందిన జింక శ్రీశైలంకు గ్రామ శివారులోని అటవీభూమి పక్కన సాగుభూమి ఉంది. అందులో వరితోపాటు మిరప పంట సాగు చేశారు.

ఇటీవల గ్రామానికి బృహత్‌ పల్లె ప్రకృతి వనం మంజూరైంది. అటవీశాఖ అధికారులు దీనికోసం ఐదు ఎకరాల స్థలం కేటాయించారు. శనివారం అక్కడికి వచ్చిన డిప్యూటీ ఎఫ్‌ఆర్‌ఓ రాజమణి, బీట్‌ అధికారి హరిత.. మిగతా భూమితోపాటు శ్రీశైలం పోడు చేసుకుంటున్న అటవీభూమిని సైతం దున్ని చదును చేయాలని సిబ్బందికి చెప్పారు. దీంతో శ్రీశైలం తమ తాతల కాలం నుంచి పోడు భూమిలో సాగు చేస్తున్నామని.. పంటను నాశనం చేయొద్దని అధికారులను కోరాడు.

ఈ నేపథ్యంలో అతను అధికారులతో వాగ్వాదానికి దిగాడు. పనులను అడ్డుకోవడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై వారు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీశైలం, అటవీశాఖ అధికారులు, సర్పంచ్‌ కలసి తన పొలంలో బృహత్‌ పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియో ద్వారా బాధను తెలిపాడు. ఈ భూమి పోతే తమకు వేరే ఆధారం లేదని రోదిస్తూ పురుగు మందు తాగాడు. వీడియోను చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అతడిని మెదక్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీశైలం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.  

అది అటవీ భూమి..  
జింక శ్రీశైలం ఇప్పటికే అటవీ భూమిని ఆక్రమించి వరి సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది కొత్తగా మరో ఎకరా అటవీభూమి దున్ని మిరప పంట సాగు చేస్తున్నాడు. అటవీ భూమి కావడంతో పల్లెప్రకృతి వనం కోసం చదును చేస్తుండగా అడ్డుకొని ఇష్టానుసారంగా దూషించాడు. భూమికి సంబంధించి ఆధారాలు చూపించలేకపోయాడు. సిబ్బంది పనులకు అడ్డు తగలడంతో వాటిని నిలిపివేసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ కోసం వస్తారన్న ఆందోళనతో శ్రీశైలం పురుగు మందు తాగి ఉండవచ్చు.  
– రాజమణి, డిప్యూటీ ఎఫ్‌ఆర్‌ఓ, కౌడిపల్లి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top